Fri Nov 15 2024 21:42:35 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : బాబు తన ప్రయారిటీని మార్చుకున్నారా? ఖజానా ఖాళీ అవుతుంటే అనవసర ఖర్చులెందుకనేనా?
చంద్రబాబు తొలి ప్రాధాన్యత అమరావతి. అదేతనకు పేరు తెచ్చి పెడుతుందని ఆయన భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాధ్యనతనిచ్చే అంశాలు రెండే రెండు. ఒకటి అమరావతి. మరొకటి పోలవరం. పోలవరం ఇప్పట్లో పూర్తి కాదని తెలుసు. దాదాపు నాలుగు సీజన్లు పడుతుందని ఆయనే స్వయంగా చెప్పారు. దీంతో ఇక అమరావతి నిర్మాణంపైనే ఆయన ఎక్కువ దృష్టి పెట్టారు. రాజధాని నిర్మాణాన్ని ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా కొంత చేయూతనిస్తుండటంతో ఈ టర్మ్ లోనే వీలయినంత వరకూ నిర్మాణ పనులు పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చారు. మొత్తం తొమ్మిది నగరాలను నిర్మించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఐఐటీ నిపుణుల నివేదిక సమర్పించగానే భవన నిర్మాణాల కాంట్రాక్టుకు అప్పగించే అవకాశాలున్నాయి.
తొలి ప్రాధాన్యత....
చంద్రబాబు తొలి ప్రాధాన్యత అమరావతి. అదేతనకు పేరు తెచ్చి పెడుతుందని ఆయన భావిస్తున్నారు. అదే సమయంలో అమరావతి నిర్మాణం జరిగితే తన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆశిస్తున్నారు. అందుకే అమరావతిపై పెట్టిన ఫోకస్ మిగిలిన అంశాలపై పెట్టడం లేదన్న విమర్శలున్నాయి. ప్రధానంగా రహదారుల అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలును కూడా వీలయితే పక్కన పెట్టి మరీ ఆయన రాజధాని నిర్మాణంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే తొలి నుంచి ఆయన ఆలోచనలన్నీ రాజధాని నిర్మాణం చుట్టూనే సాగుతున్నాయి. ఆయన అధికారం చేపట్టిన తర్వాత పోలవరం, రాజధాని అమరావతిలో పర్యటించి తన ప్రాధాన్యత ఏమిటో చెప్పకనే చెప్పారు.
ఇచ్చిన హామీలను...
ఇక ఇదే సమయంలో తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మెల్లగా అమలు చేయవచ్చన్న అభిప్రాయంతో ఉన్నారు. పింఛన్లు సక్రమంగా పంచడం వల్ల వృద్ధులలో కొంత సానుకూలత వస్తుందని ఆశిస్తున్నారు. అలాగే ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ద్వారా వారి నుంచి మద్దతు పూర్తి స్థాయిలో లభిస్తుందని భావిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ రెండు వర్గాలకు సకాలంలో పింఛన్, జీతాలు అందచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే తప్పించి మిగిలిన సంక్షేమ పథకాలను గాలికి వదిలేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఖజానాలో డబ్బులు లేవంటూనే రాజధాని నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లభించదు. దొరకదు కూడా.
టైం ఉంది కాబట్టి...
ఆయన ప్రయారిటీ ఏంటో అర్థమయింది. ప్రజలు రాష్ట్ర ఆర్థిక పరిస్థిితిని అర్థం చేసుకోవాలని పదే పదే విజ్ఞప్తి చేయడం వెనక కూడా ఇదే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఖజానాపై భారం పడి అమరావతి నిర్మాణం ఆగిపోతుందని ఆయన కొంత వెనకడుగు వేస్తున్నారు. అందుకే మెల్లగా వెల్ఫేర్ స్కీమ్ లను అమలు చేయాలని అనుకుంటున్నట్లు తెలిసింది. ఇంకా చాలా సమయం ఉంది. అప్పుడే సంక్షేమ పథకాలను మొదలు పెట్టి ఖజానాపై భారం మోపే కంటే కొంత ఆలస్యం చేసుకుంటూ వెళ్లి కాస్తంత రిలీఫ్ చెందవచ్చని అనుకుంటున్నారు. రాజధాని నిర్మాణం పూర్తయితే తన కీర్తి మరింత పెరుగుతుంది. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేసినా ఓటమి తప్పలేదు. అందుకే చంద్రబాబు తన ప్రయారిటీని మార్చుకున్నట్లే కనపడుతుంది.
Next Story