Sun Nov 17 2024 16:23:47 GMT+0000 (Coordinated Universal Time)
ఒక్కసారిగా పెరిగిన చికెన్ ధర.. ఏం కొంటాం - ఏం తింటాం అంటున్న సామాన్యులు
గతవారంలో కిలో బాయిలర్ కోడి మాంసం ధర రూ.200-రూ.210 వరకు ఉండగా.. ఫారం కోడి ధర రూ.150-రూ.170 వరకు..
నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయే తప్ప తగ్గింది లేదు. ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న ధరలను నియంత్రించకుండా.. చోద్యం చూస్తున్నాయి. కూలి పని చేసుకునేవారికైనా, నెలజీతానికి పనిచేసే చిరు ఉద్యోగులైనా.. తమ జీతాలు పెరగడం లేదు కానీ.. తినే ఆహార వస్తువుల ధరలు మాత్రం పెరుగుతుండటం పై ఆందోళన చెందుతున్నారు. నాన్ వెజ్ లో చాలా రకాలుంటాయి. చెరువుల్లో పండించే చేపలు, రొయ్యలు వగైరా తక్కువ ధరకే వచ్చినా అంత ఆరోగ్యకరం కాదు. సముద్రం నుంచి వచ్చే వాటి ధరలు భారీగా ఉంటాయి. అలాగే మటన్ ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.
ఇక ఎటొచ్చి సగటు మధ్యతరగతి కుటుంబాలు ఉన్నంతలో తినగలిగే నాన్ వెజ్ వంటకం అంటే అది చికెనే. ఇప్పుడు వాటి ధరలకు కూడా రెక్కలొచ్చాయి. గతవారంలో కిలో బాయిలర్ కోడి మాంసం ధర రూ.200-రూ.210 వరకు ఉండగా.. ఫారం కోడి ధర రూ.150-రూ.170 వరకు ఉంది. ఈ వారం వాటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. కిలో బాయిలర్ మాంసం ధర రూ.280-285కు చేరగా.. ఫారం కోడి కిలో మాంసం ధర రూ.200 పలుకుతోంది.
వేసవిలో కోళ్ల పెంపకం తక్కువ. అందుకు తగ్గట్టుగా సీజనల్ గా వచ్చే వ్యాధులతో కొన్నికోళ్లు మృతి చెందుతాయి. డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో చికెన్ కొనుగోళ్లు పెరగడంతో ధరలు పెరిగినట్లు విక్రయదారులు చెబుతున్నారు.
Next Story