Mon Dec 16 2024 14:56:13 GMT+0000 (Coordinated Universal Time)
Nagababu : నాగబాబుకు మంత్రి పదవి ఎంత దూరంలో ఉందంటే?
జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నారంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నారంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయినా ఇంత వరకూ నాగబాబును కేబినెట్ లోకి తీసుకోలేదు. చంద్రబాబు ప్రకటన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన నాగబాబు తన సోదరుడు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కలసి ఆయనకు కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయారు. అదే సమయంలో చంద్రబాబును మాత్రం కలవకపోవడం, తిరిగి హైదరాబాద్ కు వెళ్లిపోవడంతో నాగబాబుకు మంత్రి పదవి విషయంలో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారన్న ప్రచారం జరిగింది. నాగబాబును కేబినెట్ లో తీసుకునే విషయంలో టీడీపీ, జనసేనలో కూడా కొంత అసంతృప్తి బయలుదేరిందన్న వార్తలు వచ్చాయి.
నిజమెంత?
అయితే అందులో ఏమాత్రం నిజం లేదని తెలిసింది. నాగబాబుకు కేబినెట్ లో చోటు ఖాయమమయింది. మంచి ముహూర్తం చూసుకుని రాజ్ భవన్ లో నాగబాబు చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అయితే అందుకు ముహూర్తం మాత్రం ఇంకా నిర్ణయం కాలేదు. మరో ఐదు నెలల్లో ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి నాగబాబుకు ఫిక్స్ అయింది. అయితే ఎమ్మెల్సీ అయిన తర్వాత నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారా? లేక ముందుగానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీని చేయాలా? అన్న విషయంపై ఆలోచించుకుని చెప్పాలని చంద్రబాబు పవన్ కల్యాణ్ కే వదిలేశారన్నది పార్టీ వర్గాల టాక్.
వెనక్కు తీసుకుంటారా?
కానీ దీనిపై కొంత ఆలోచన బయలుదేరిందంటున్నారు. ముందుగా మంత్రి పదవి చేపట్టి ఎమ్మెల్సీని చేస్తే కొంత వ్యతిరేకత వస్తుందా? రాదా? అన్న దానిపై పవన్ కల్యాణ్ పార్టీలోని కొందరు ముఖ్యులతో చర్చించినట్లు తెలిసింది. ఈలోపు టీడీపీపై గతంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో విపరీతంగా కొందరు ట్రోల్ చేస్తున్నారు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటే తప్పుడు సంకేతాలు పంపినవారమవుతామని టీడీపీ నేతలు అభిప్రాయపడినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ టీడీపీ నేతలు,కార్యకర్తలు అసంతృప్తి వెళ్లగక్కినంత మాత్రాన చంద్రబాబు తన నిర్ణయాన్నివెనక్కు తీసుకోరు. యనమల వంటి వారు కూడా అసంతృప్తిని బహిరంగంగా లేఖ ద్వారా వెల్లడించింది ఇందుకేనా? అన్నఅనుమానాలు కూడా కలుగుతున్నాయి.
ఆ ప్రచారంలో వాస్తవం ఎంత?
అదే సమయంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం ఫిక్స్ అయింది. కానీ డేట్ మాత్రమే నిర్ణయించలేదు. అది పవన్ కల్యాణ్ కే చంద్రబాబు వదిలేశారు. అంతేతప్ప చంద్రబాబు కేబినెట్ లోకి తీసుకోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. కేవలం ఒక్క మంత్రి పోస్టు కోసం పవన్ ను కాదనుకునేంత అమాయకుడు చంద్రబాబు కాదన్నది అందరికీ తెలిసిందే. అందుకే పవన్ కల్యాణ్ ముహూర్తం నిర్ణయించి ఎప్పుడు ఓకే అంటే అప్పుడు ప్రమాణస్వీకారం చేయిస్తారంటున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్ లో ఉన్న మంత్రుల్లో ఒకరిద్దరిని మారుస్తారన్న ప్రచారం కూడా ఒట్టిదేనంటున్నారు. నాగబాబు ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని, అది ఎప్పుడన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదని జనసేన ముఖ్యనేత ఒకరు తెలిపారు.
Next Story