Mon Dec 23 2024 10:31:37 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : అమరావతి నిర్మాణాన్ని వేగిరం పూర్తి చేయడమే లక్ష్యం... సంపద సృష్టించే దిశగా
రాజధాని అమరావతి నిర్మాణపనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు
రాజధాని అమరావతి నిర్మాణపనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకోసం నేడు వరస సమావేశాలను ఏర్పాటు చేశారు. 2014 - 2019 మధ్య కాలంలో చేసిన తప్పిదాలు చేయకుండా ఈసారి ముఖ్యంగా రాజధాని నిర్మాణంపైనే కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పదిహేను వేల కోట్ల రూపాయల నిధులు అప్పుల రూపంలో వస్తుండటంతో పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకోసం కసరత్తులు ప్రారంభించారు. వీలయినంత త్వరగా రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించి పనులు పూర్తి చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు.
సీఆర్డీఏ సమావేశం...
చంద్రబాబు నాయుడు అజెండాలో ప్రధానమైనది రాజధాని నిర్మాణం. రాజధాని నిర్మాణం పూర్తయితే ఎక్కువ కంపెనీలు వస్తాయని ఆయన భావిస్తున్నారు. సంపదను సులువుగా సృష్టించవచ్చన్న అంచనాలో ఉన్నారు. అందుకోసమే ఆయన ఈరోజు సీఆర్డీయే అధారిటీ తో సమావేశమవుతున్నారు. చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3.30 కి సమావేశం జరగనుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం.అధారిటీ చైర్మన్ గా ఉన్న సీఎం,వైస్ చైర్మన్ గా మున్సిపల్ శాఖ మంత్రి,సభ్యులుగా ఆర్థిక శాఖ మంత్రి,తో కలిపి మొత్తం 11 మంది సభ్యులు అమరావతి నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఐఐటీ నిపుణులు....
దీంతో పాటుగా ఈరోజు అమరావతికి ఐఐటి నిపుణులు రానున్నారు. గతంలో మధ్యలోనే నిలిచిపోయిన నిర్మాణాల సామర్ధ్యాన్ని అధ్యయనం చేయనున్నారు ఫౌండేషన్ దశలో నిలిచిపోయిన సెక్రటేరియట్, శాఖాధిపతుల టవర్లు, హైకోర్టు కట్టడాలను పరిశీలించనుంది. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఉద్యోగుల క్వార్టర్లు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు క్వార్టర్లను పరిశీలించనున్నారు. ఈరోజు సాయంత్రం మున్సిపల్ శాఖపై కూడా చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. మొత్తం మీద చంద్రబాబు మాత్రం రాజధాని నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లే కనిపిస్తుంది.
Next Story