Sun Dec 01 2024 04:36:01 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : జేసీ కుటుంబానికి ఝలక్ ఇచ్చిన చంద్రబాబు
కడప ఆర్టీపీపీ విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబం వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు
కడప ఆర్టీపీపీ విషయంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబం వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. ప్రధానంగా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనకు ఇష్టమొచ్చిన తరహాలో వ్యవహరించడంతో పాటు కడపలో ఉన్న ఆర్టీపీపీ ఫ్లైయాష్ కాంట్రాక్టును తమకే కావాలని పట్టుబట్టడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే కాకుండా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందుకు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిని చంద్రబాబు మందలించారు. ఇలా అయితే కష్టమని కొంచెం కటువుగానే చంద్రబాబు అస్మిత్ రెడ్డితో వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఎవరిష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తే ఇక పార్టీ ఎందుకని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది.
విమానాశ్రయంలోనే...
నిన్న అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు జేసీ అస్మిత్ రెడ్డి వెళ్లారు. ఈ పర్యటనకు జేసీ ప్రభాకర్ రెడ్డి దూరంగా ఉన్నారు. జేసీ అస్మిత్ రెడ్డిని పక్కకు తీసుకెళ్లిన చంద్రబాబు కొంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. బూడిద తరలింపు వ్యవహారంలో ఇలా రోడ్డును పడితే పార్టీ పరువు ప్రతిష్టలు ఏం కావాలని చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలిసింది. ఇద్దరూ కలసి కూర్చుని మాట్లాడుకుని దానికి పరిష్కారం మార్గం కనుక్కోవాలి కానీ, రోడ్డున పడి, సవాళ్లు విసురుకుంటే ప్రజలు నవ్వుకోరా? అని చంద్రబాబు జేసీ అస్మిత్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలు పునరావృతమయితే తాను ఊరుకునేది లేదని కూడా చంద్రబాబు హెచ్చరించినట్లు చెబుతున్నారు.
ఫ్లైయాష్ తరలింపుపై....
కడప ఆర్టీపీపీ ఫ్లై యాష్ తరలింపు కాంట్రాక్టు తమకే కావాలంటూ తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిలు పట్టుబట్టారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ను ఏర్పాటు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కడప ఆర్టీపీపీకి వస్తానని సవాల్ విసరడంతో కొంత ఉద్రిక్త పరిస్థితుులు తలెత్తాయి. ఈ వివాదం దాదాపు మూడు రోజులు నడవడం, మీడియాలో రావడంతో చంద్రబాబు నేతలను తన వద్దకు పిలిచినా, జేసీ కుటుంబం నుంచి ఎవరూ హాజరు కాలేదు. ఈ కారణంగానే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనికి అస్మిత్ రెడ్డి సమాధానం చెబుతూ తమకోసం కాదని, కార్యకర్తల కోసమేనని అని చెబుతుండగా, కార్యకర్తల సంక్షేమాన్ని తాను చూసుకుంటానని ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని గట్టిగానే చెప్పినట్లు తెలిసింది.
Next Story