Thu Apr 10 2025 04:29:24 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు ఆ వ్యాఖ్యల వెనక అసలు అర్థమిదేనట.. వారికి పథకాలు లేవనేగా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం మాట్లాడినా ఒక అర్ధం ఉంటుంది. ఆయన అన్నీ ఆలోచించి ప్రకటిస్తారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం మాట్లాడినా ఒక అర్ధం ఉంటుంది. ఆయన అన్నీ ఆలోచించి ప్రకటిస్తారు. ఆయనకు ఉన్న రాజకీయ అనుభవం అలాంటిది. ఎందుకంటే ఏదో రాజకీయంగా ఆషామాషీగా మాట్లాడే వ్యక్తి చంద్రబాబు కాదు. ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కొంత వివాదాస్పదమయ్యాయి. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిగా ఆయన అన్నది తప్పేనంటూ అనేక మంది కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో కాదు.. టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆ వ్యాఖ్యలను చేశారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వైసీపీ నేతలకు ఎలాంటి సాయం చేసినా తాను ఊరుకోనని, ఈ విషయాన్ని నేతలందరూ గమనించాలని జీడీ నెల్లూరులో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వారికి ప్రయోజనం చేకూర్చినా...
కానీ చంద్రబాబు మాత్రం దూరదృష్టితోనే ఈ వ్యాఖ్యలను చేసినట్లు అర్థమవుతుంది. వైసీపీ వారికి ప్రయోజనం చేసినా తమకు వచ్చే ఎన్నికలలో అండగా నిలవరు. జగన్ ఓటు బ్యాంకు చెదరదు. కూటమి ప్రభుత్వంలోనూ వారికి సాయం చేశామంటే రాజకీయంగా అర్థం లేదన్నది చంద్రబాబు ఆలోచన. ఎటూ వారు తమకు మద్దతివ్వరని, అలాంటి వారికి ప్రయోజనాలు చేకూర్చడమెందుకన్నది చంద్రబాబు ప్రశ్న. అదే సమయంలో వైసీపీ వారికి ప్రయోజనం చేకూరిస్తే టీడీపీ వాస్తవ క్యాడర్ నుంచి వ్యతిరేకత మొదలవుతుందని, అది తమ పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు తెచ్చి పెడుతుందని కూడా అంచనా వేసి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. వైసీపీ అనుకూలురైన వారికిపథకాలు కూడా అందవని చెప్పేసినట్లయింది. దీనివల్ల లబ్దిదారుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గే అవకాశముంది.
జిల్లాల పర్యటనకు...
మరో బలమైన కారణం కూడా ఉందంటున్నారు. జగన్ త్వరలో జిల్లాల పర్యటనకు బయలుదేరుతారంటున్నారు. జగన్ సభలకు, రోడ్ షోలకు ఎక్కువ మంది హాజరు కాకుండా ఈ కామెంట్స్ కొంత వరకూ అడ్డుకట్ట పడతాయని భావిస్తున్నారు. తాము జగన్ పార్టీ వారమని తెలిస్తే ప్రయోజనాలు, పథకాలు అందవన్న భయం కలిగి వాటికి దూరంగా ఉంటారని కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు. జగన్ సభలకు వచ్చి తాము వైసీపీ అని గుర్తింపు వస్తే తమకు నాలుగున్నరేళ్లు ప్రయోజనాలు అందవని, అందుకే జగన్ సభలకు కూడా దూరంగా ఉండే అవకాశముందని కూడా పసుపు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకే చంద్రబాబు ఈ రకమైన కామెంట్స్ చేసినట్లు చెబుతున్నారు.
వైసీపీ నేతలతో కలసి...
ఇంకొక విషయమేంటంటే.. టీడీపీ కార్యకర్తలు కూడా కోరుకునేది ఇదే. తమ ప్రభుత్వంలో తమకే ప్రయోజనాలు అందాలని వారు భావిస్తారు. ఇది తమ ప్రభుత్వం కనుక తమకు కాకుండా ప్రత్యర్థి పార్టీకి కూడా ప్రయోజనాలు అందితే ఇక వృధా అంటూ సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు పోస్టులు పెడుతున్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు ఈ కామెంట్స్ చేసినా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇది వర్తిస్తుందని ఆయన బలమైన సంకేతాలు పంపినట్లయింది. వైసీపీ నేతలో వ్యాపార భాగస్వామ్యంతో పాటు వారితో లాలూచీ పడటం చేస్తే తాను ఊరుకోబోనని కూడా ఆ సభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలకు హెచ్చరిక పంపినట్లు అర్థమవుతుంది.
Next Story