Mon Dec 23 2024 16:37:34 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నవ్వుతూనే.. నవ్విస్తూనే వార్నింగ్ లు.. చంద్రబాబు లో ఇంతటి మార్పా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో మాదిరిగా కాకుండా ఆయన తన వ్యవహారశైలిని మార్చుకున్నారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో మాదిరిగా కాకుండా ఆయన తన వ్యవహారశైలిని మార్చుకున్నారు. ఎప్పడూ సీరియస్ గా ఉండే చంద్రబాబు నిన్న జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చాలా జోవియల్ గా ఉన్నారు. కలెక్టర్ల సమావేశంలో ఆయన తీరును చూసిన సీనియర్ అధికారులు కూడా చంద్రబాబులో ఇంత మార్పు వచ్చిందేనని గుసగుసలాడుకుంటున్నారు. గతంలో చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో చిర్రుబుర్రులాడుతుండేవారు. అవతలి వారికి మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇచ్చేవారు కాదు. తాను చెప్పదలచుకున్నది చెెప్పేసి వెళ్లిపోయేవారు. జిల్లా స్థాయిలో చేయాల్సిన పనులు, రాష్ట్ర స్థాయిలో అనుసరించాల్సిన విధానాలను గురించి ఆయన గంటల తరబడి కలెక్టర్లకు చెప్పేవారు.
కలెక్టర్ల కాన్ఫరెన్స్ చూస్తే...
కానీ నిన్న జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ చూస్తే మాత్రం చంద్రబాబులో చాలా తేడా కనిపిస్తుందంటున్నారు. సమావేశం ప్రారంభమయిన దగ్గర నుంచి జోకులు వేస్తూ కలెక్టర్లకు తమ ప్రభుత్వ విధానాన్ని చెప్పకనే చెప్పారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏం చేయాలో ఆయన చెప్పదలచుకున్నది కుండ బద్దలు కొట్టేశారు. భవిష్యత్ లో తమ ప్రభుత్వం అనుసరించే విధానాలను గురించి కూడా ఆయన సమగ్రంగా వివరించారు. అంతేకాదు ప్రజాసమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని సుతిమెత్తంగా హెచ్చరించారు. ముఖ్యంగా ఉచిత ఇసుక విధానంపై ఆయన తన పాలసీని చెప్పారు. ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. 1995 నాటి చంద్రబాబును చూస్తారంటూనే నాడు ఏం జరిగిందో నవ్వుతూ చెప్పారు.
చెప్పాలనుకున్నది....
ప్రజలపై భారం పడకుండా ఇసుకను పంపిణీ చేయాలన్నారు. ఎవరైనా అవకతవకలకు పాల్పడితే కలెక్టర్లను కూడా రీకాల్ చేస్తానని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో కలెక్టర్లు, సీనియర్ అధికారుల చేత కూడా ఆయన మాట్లాడించారు. గతంలో లేని విధంగా వారు చెప్పేది శ్రద్ధగా వింటూ అందులో మార్పులు చేర్పులను ఆయన సూచిస్తున్నారు. ఒకవైపు అందరిని నవ్విస్తూ.. తాను నవ్వుతూ.. మరొక వైపు సీరియస్ గా కలెక్టర్లకు తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశారు. కలెక్టర్లు కూడా గతంలో మాదిరిగా కాకుండా చంద్రబాబు సమక్షంలో ఫ్రీగా మాట్లాడుతుండటం ఆయనలో మార్పునకు సంకేతంగా చర్చించుకుంటున్నారు.
Next Story