Fri Dec 20 2024 14:18:36 GMT+0000 (Coordinated Universal Time)
Amaravathi : అంతా అమరావతికేనా? నిధులు కుమ్మరిస్తే ఎలా? కూటమిలో గుసగుసలు
అమరావతి నిర్మాణానికి మాత్రం అరవై కోట్ల నిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్నారు
అమరావతి నిర్మాణానికి మాత్రం అరవై కోట్ల నిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం అప్పులు చేసి మరీ జనవరి నెల నుంచి పనులు ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. సీఆర్డీఏ కు ఇప్పటికే ఇరవైనాలుగు వేల కోట్ల రూపాయల పనులకు సంబంధించి అనుమతిమంజూరు చేశారు. ఈవిషయాన్ని మున్సిపల్ మంత్రి నారాయణ తెలిపారు. మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. జనవరి నెల నుంచి పనులు ప్రారంభం కావాలని చంద్రబాబు అధికారులను ఇప్పటికే ఆదేశించారు.అయితే అమరావతిపై పెట్టిన శ్రద్ధ, ఖర్చుచేస్తున్న నిధులను సంక్షేమం కోసం మాత్రం పెట్టడంలో కూటమి సర్కార్ ఒకింత వెనకడుగు వేస్తుందన్న విమర్శలు బాగా వినిపిస్తున్నాయి.
దశలవారీగా...
రాజధాని నిర్మాణం కావాలంటే ఉన్నట్లుండి అభివృద్ధి కాదని, కాలానుగుణంగా అక్కడ పరిస్థితులను బట్టి రాజధాని ప్రాంతం విస్తరిస్తుందన్నఅభిప్రాయం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. కానీ అదే పనిగా ఒకే పనికి ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి అసెంబ్లీ, సచివాలయం భవనాలను నిర్మించడం, అదీ ఇంత హడావిడిగా చేయడం ఎందుకన్న ప్రశ్నలు నెట్టింట వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వానికి రాజధాని అమరావతి ప్రాధాన్యత అంశమేకావచ్చు కానీ, అదే సమయంలో పేద, మధ్య తరగతి ప్రజలకు సంక్షేమ పథకాలు కూడా అంతే అవసరమని చెబుతున్నారు. భారీగా అప్పులను సేకరించి వాటిని రాజధాని ఒక్కదానికే ఖర్చు చేయడం ఎంత వరకూ సబబని కొందరు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. రాజధాని నిర్మాణ పనులకు తొలి విడతే ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తే వ్యయం లక్ష కోట్లు దాటే అవకాశం లేకపోలేదన్న అనుమానం కలుగుతుంది. రాజధానితో లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పిన చంద్రబాబు లక్ష కోట్లు అప్పులు చేసి మరీ అమరావతికి అందాలను తేవడం అవసరమా? అన్న ప్రశ్నలు కూటమి పార్టీలను ఇబ్బంది పెడుతున్నాయి.
ప్రయారిటీ ఉంటుందని...
టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తే రాజధాని అమరావతికి ప్రాధాన్యత ఇస్తారని అందరూ ఊహించిందే. అయితే అదే సమయంలో ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల మ్యానిఫేస్టోను చూసి జనం కూటమి పార్టీల వైపు మొగ్గారు. ఏదైనా సమతుల్యంతో పనులు జరగాలి. ఇటు అభివృద్ధి పనులు, అటు సంక్షేమం సమానంగా జరుపుకుంటూ వెళితే ప్రజల్లో కూడా ఎలాంటి వ్యతిరేకత రాదని, కానీ వేల కోట్ల నిధులు అమరావతిలో కుమ్మరించడంపై సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. రాజధానిలో అసెంబ్లీ, సచివాలయ భవనాలు ఉన్నందున, వాటిని మళ్లీ నిర్మించకుండా ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై పెడితే బాగుంటుందన్న సూచనలు కూడా వెలువడుతున్నాయి.
అమరావతిని అభివృద్ధి చేస్తే...
అమరావతి అభివృద్ధి చెందినంత మాత్రాన పోలో మంటూ పెట్టుబడులు వచ్చిపడతాయా? అన్న ప్రశ్నలు కూడా వినపడుతున్నాయి. సొంత పార్టీ క్యాడర్ కూడా ఈ విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్ననిర్ణయాలపై పెదవి విరుస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి మాటనిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి తప్పించి, నిధులన్నీఒకేచోట కుమ్మరించడం ఎంత వరకూ సబబని మరి కొందరు సోషల్ మీడియాలో నేరుగా పార్టీ నేతలను నిలదీస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సుమారు యాభై ఏళ్ల అనుభవమున్న చంద్రబాబు నాయుడు ప్రజలనాడిని కూడా పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు చేపడితే బాగుంటుందన్న సూచనలు సైకిల్ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story