Chandrababu : ఎవరినీ వదిలేది లేదు.. బాధ్యులపై కఠిన చర్యలు
రాజకీయాలకు అతీతంగా తిరుమల శ్రీవారి సేవ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
రాజకీయాలకు అతీతంగా తిరుమల శ్రీవారి సేవ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఐదేళ్లు కొత్త సంప్రదాయాన్ని నిలబెట్టారన్నారు. టిక్కెట్లు తిరుపతిలో ఇవ్వడం సరికాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కొండ మీద అయితే ఎంత సమయమైనా భక్తులు వేచి ఉంటారని, కానీ కొండ కింద అంతసేపు వేచి ఉండటానికి ఎవరూ ఇష్టపడరని ఆయన అన్నారు. అసమర్థత, అనాలోచిత నిర్ణయాల వల్ల భక్తులు ఇబ్బంది పడకూడదని తెలిపారు. టీటీడీ చేసిన సమీక్షలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. తిరుపతిలో టిక్కెట్లు ఇవ్వడం సరికాదని అనేక మంది భక్తులు అభిప్రాయపడ్డారు. ఆరు మంది చనిపోయారని, ఒక్కొక్క కుటుంబానికి టీటీడీ నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని నిర్ణయించామని,అలాగే ఆ కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. బాగా గాయపడిన వారికి ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. స్వల్ప గాయాలయిన వారిలో 35 మందికి ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్పీ, జేఈవో గౌతమిని బదిలీ చేస్తున్నామని తెలిపారు.