Andhra Pradesh : మహిళలకే కాదు.. వాలంటీర్లకు సంక్రాంతి కానుక.. కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం
నేటి కేబినెట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వాలంటీర్ల వ్యవస్థపై డెసిషన్ తీసుకోనున్నారు
నేడు కేబినెట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే దీనిపై ఒక క్లారిటీకి వచ్చిన ముఖ్యమంత్రి మంత్రుల ఎదుట ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నది సమావేశంలో చెప్పనున్నారు. ఆయన ఇప్పటికే అధికారుల నుంచి దీనిపై పూర్తి స్థాయి నివేదికను తెప్పించుకుని ఉచిత బస్సు ప్రయాణాన్ని వీలయినంత త్వరగా అమలు చేయాలని నిర్ణయించారు.
ఉచిత బస్సు ప్రయాణం..
సంక్రాంతి కానుకగా ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందించాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నారు. ప్రతి పండగ రోజు ఒక సూపర్ సిక్స్ హామీని చంద్రబాబు అమలు చేస్తూ వస్తున్నారు. గత దీపావళి నాడు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అందచేశారు. ఉచిత గ్యాస్ పథకాన్ని శ్రీకాకుళం నుంచి అంటే ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించిన చంద్రబాబు నాయుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మాత్రం రాయలసీమ నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది. తన సొంత జిల్లా అయిన చిత్తూరు నుంచి ఈ పథకం ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారు.
వాలంటీర్లను కొనసాగించడంపై…
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు జనవరి నుంచి జన్మభూమి కార్యక్రమాలపై కూడా ఈ కేబినెట్ లో చర్చించనున్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరుపై కూడా ఈ సమావేశంలో స్పష్టత ఇచ్చే అవకాశముంది. ఇక మరో కీలక నిర్ణయం కూడా మంత్రి వర్గ సమావేశం తీసుకోనుంది. వాలంటీర్ల విసయంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వాలంటీర్ల సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి? పంచాయతీరాజ్ కు వారిని అనుసంధానం చేసే విషయంపై చర్చించి చంద్రబాబు మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లను ఇక విధుల్లోకి తీసుకోకూడదని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. అదే సమయంలో వారి చేత పింఛన్లు మాత్రం పంపిణీ చేయించకుండా ఇతర పనులను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుందని తెలిసింది. మొత్తం మీద కీలకమైన నిర్ణయాలు ఈ కేబినెట్ సమావేశంలో తీసుకునే అవకాశముంది.