Mon Dec 15 2025 04:07:45 GMT+0000 (Coordinated Universal Time)
పోర్టుతో బోలెడు ప్రయోజనాలు
రవాణా ఖర్చులు మరింత తగ్గించేందుకు పోర్టుల నిర్మాణంతో సాధ్యమవుతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.

రవాణా ఖర్చులు మరింత తగ్గించేందుకు పోర్టుల నిర్మాణంతో సాధ్యమవుతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రామాయపట్నం పోర్టుకు జగన్ శంకుస్థాపన చేశారు. రామాయపట్నం పోర్టు తొలి దశ నిర్మాణం 36 నెలల్లో పూర్తవుతుందన్నారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. గూడ్లూరు మండలం మొండివారి పాలెంలో పోర్టు నిర్మాణం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం హడావిడిగా ఎన్నికలకు రెండు నెలల ముందు శంకుస్థాపన చేసిందన్నారు. డీపీఆర్ లేకుండా, భూసేకరణ జరపకుండా గత పాలకులు శంకుస్థాపన చేశారన్నారు. ఇంతకంటే మోసం మరొకటి ఉంటుందా? అని జగన్ ప్రశ్నించారు.
మరో నాలుగు పోర్టులు...
పోర్టు రావడం వల్ల ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. స్థానికులకే 70 శాతం ఉద్యోగాలు దక్కుతాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఆరు పోర్టులే కాకుండా మరో నాలుగు పోర్టులను కూడా నిర్మిస్తామని జగన్ తెలిపారు. తద్వారా ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లకుండా ఇక్కడే లక్షల సంఖ్యలో యువతకు ఉపాధి దొరుకుతుందని చెప్పారు. పోర్టుకు ఆనుకుని పారిశ్రామిక క్యారిడార్ ను కూడా కావలి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని జగన్ తెలిపారు. కందుకూరు మున్సిపాలిటీకి ఆర్థిక సాయాన్ని అందచేస్తామని చెప్పారు. పోర్టులతో పారిశ్రామిక రంగం మరింత పుంజుకుంటుందని జగన్ తెలిపారు. ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుకుంటున్నానని జగన్ అన్నారు. ప్రాజెక్టుకు సహకరించేందుకు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన రైతులను జగన్ అభినందించారు. అంతకు ముందు జగన్ సముద్రుడికి పూజలు చేశారు. పట్టు వస్త్రాలను సమర్పించారు.
Next Story

