Sun Dec 22 2024 08:05:55 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే... చంద్రబాబుది అంతా మోసం
తిరిగి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మన ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు
తిరిగి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మన ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మళ్లీ బడ్జెట్ ను కూడా మనమే ప్రవేశపెడతామని తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఎవరూ చంద్రబాబును నమ్మడం లేదన్నారు. తమ ప్రభుత్వం మంచి చేయలేదని భావిస్తే ప్రతిపక్షాలందరూ ఏకం కావాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఇస్తున్న మ్యానిఫేస్టోలో ఏ అంశాన్ని అమలు చేసే ఉద్దేశ్యం లేదన్నారు. చంద్రబాబు ఇచ్చే వాగ్దానాలకు 1.26 కోట్లు ఏడాదికి అవుతుందని జగన్ అన్నారు. గతంలో 650 హామీలిస్తే ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు పర్చలేదన్నారు.
ఇష్టమొచ్చినట్లు...
తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఏడాదికి70 వేల కోట్ల రూపాయలు అని, దానికి మించి ఇష్టమొచ్చినట్లు అడ్డగోలుగా వాగ్దానాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే జాతీయ పార్టీతో కలసి కుట్రలు చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు మేనిఫేస్టో బుట్టదాఖలా అవుతుందని ఆయన అన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం పేరైనా గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. పథ్నాలుగేళ్లు ముఖ్మమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఆ కాలంలో ఎందుకు ఈ పనులన్నీ చేయలేకపోయారన్నారు.
పక్క రాష్ట్రంలో ఇచ్చిన హామీలను...
పక్క రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నింటినీ తన మ్యానిఫేస్టోలో పెట్టుకున్నారని అన్నారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారన్నారు. తాను ఏనాడు అబద్ధం చెప్పలేదని, తప్పుడు వాగ్దానాలను ఇవ్వలేదని అన్నారు. చెప్పిన ప్రతి హామీని అమలు చేశానని జగన్ చెప్పుకొచ్చారు. అందరూ కలసి తనను ఎదుర్కొనేందుకు వస్తున్నారని, ప్రజలు కూడా 2014 నుంచి 2019 వరకూ, 2019 నుంచి ఇప్పటి వరకూ మీ బ్యాంకు అకౌంట్లు పరిశీలించుకున్న తర్వాతనే ఒక నిర్ణయానికి రావాలని ఆయన కోరారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తనకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని కోరుతుండటం విడ్డూరంగా ఉందని అన్నారు.
మళ్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టేది...
నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించవాడు దోచుకోగలుతాడు అన్న సిద్ధాంతం చంద్రబాబుది అని అన్నారు. తాము గెలుస్తామని ధీమా ఉంటే ఇన్ని పొత్తులు, అన్ని ఎత్తులు ఎందుకని చంద్రబాబును ప్రశ్నించారు. హామీలు అమలు చేయని చంద్రబాబును 2024 ఎన్నికల్లో నమ్మడం ఎంత వరకూ సబబని ఆయన అన్నారు. సంపద సృష్టించానని పదే పదే చెబుతున్న చంద్రబాబు ఆయన పాలనలో ప్రతి ఏడాది లోటేనని తెలిపారు. విశ్వసనీయత ఎవరికుందో ప్రజలు అర్ధం చేసుకోవాలని జగన్ పిలుపు నిచ్చారు. మళ్లీ మూడు నెలలకు ఇదే సభలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడతామని జగన్ అన్నారు. జగన్ ప్రసంగం ముగిసిన తర్వాత స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.
Next Story