Mon Dec 23 2024 05:16:02 GMT+0000 (Coordinated Universal Time)
Ys jagan : కాకినాడలో షర్మిల వ్యవహారంపై జగన్ పరోక్ష వ్యాఖ్యలు
కొత్త సంవత్సరం అంటే క్యాలిండర్ మార్పు మాత్రమే కాదు వారి జీవితంలో మార్పు జరగాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు
కొత్త సంవత్సరం అంటే క్యాలిండర్ మార్పు మాత్రమే కాదు వారి జీవితంలో మార్పు జరగాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కాకినాడలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. రాబోయే రోజుల్లో కుటుంబాలను చీల్చే కుట్రలు జరుగుతాయని జగన్ అన్నారు. పింఛను మొత్తాన్ని ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయలకు పెంచామని ఆయన తెలిపారు. 66.34 లక్షల మంది ఈ పింఛను ను ప్రతి నెల ఒకటో తేదీన అందుకుంటున్నారని అన్నారు. సామాజిక పింఛన్లను పెంచడం ప్రభుత్వం ఉద్దేశ్యం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి ఆర్థికంగా చేయూతను అందించడమేనని తెలిపారు. రెండు వేల కోట్ల రూపాయలు నెలకు పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పారు. సెలవు దినమయినా, పండగరోజు అయినా సరే.. పింఛను ప్రతి నెల ఒకటో తేదీన ఇస్తున్నామని తెలిపారు.
ఎన్నికలకు రెండు నెలల ముందు...
నాలుగున్నరేళ్ల క్రితం చంద్రబాబు పాలనలో ఎన్నికలకు ముందు వరకూ కూడా వెయ్యి రూపాయలు పింఛను ఇచ్చారన్నారు. ఎన్నికలకు రెండు నెలలు ముందు రెండువేలకు పెంచారన్నారు. అదీ జగన్ ఎన్నికలలో హామీ ఇవ్వబట్టే చంద్రబాబు పింఛను మొత్తాన్ని పెంచారన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ప్రతి ఒక్కరి చేతిలో 1.47 లక్షలు పెట్టడం జరిగిందన్నారు. గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించాలని జగన్ కోరారు. గతంలో పింఛను పొందాలంటే పడిగాపులు కాయడమే కాకుండా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాలని అన్నారు. సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికే ఇస్తున్నామన్నారు. బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదును జమ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు? ఇప్పుడు జగన్ ఎందుకు చేయగలిగాడో ఆలోచించాలని కోరారు.
బాబు హామీలు అమలుపర్చకపోతే...
చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు గతంలో ఇచ్చిన హామీలు ఏమి అమలు చేశారో ఆలోచించమని జగన్ కోరారు. కనీసం దత్తపుత్రుడు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రశ్నించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయలేదని అన్నారు. ఈరోజు తమ ప్రభుత్వం 31 లక్షల మందికి ఇళ్లు కడుతూ ఉంటే సీబీఐ దర్యాప్తు జరపాలని కేంద్రానికి ఈ దత్తపుత్రుడు లేఖ రాస్తాడని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణాన్ని ఆపించాలని ఈ దత్తపుత్రుడి ప్రయత్నమని అన్నారు. చంద్రబాబు అవినీతిపరుడని ఆదాయపుపన్ను శాఖ, ఈడీ అధికారులు సమన్లు ఇస్తే, న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు జైలులో పెడితే జైలుకు వెళ్లి దత్తతండ్రిని పరామర్శించి చాలా మంచోడని సర్టిఫికేట్ ఇస్తాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతిలో భాగస్వామ్యం ఉండబట్టే దత్తపుత్రుడు నోరు మెదపలేదని అన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు సున్నా అని అన్నారు. ఈరోజు 2.60 కోట్లు పేదలకు బటన్ నొక్కి అందచేశామని అన్నారు.
రాబోయే రోజుల్లో...
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా అమ్మఒడి లేదని, రైతు భరోసా పథకం లేదని అన్నారు. వైఎస్ ఆసరా స్కీమే నాడు లేదని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు చెబతారని, ఇంటికి కిలో బంగారం, ఇంటికో బెంజ్ కారు ఇస్తామని చెబుతారన్నారు. కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమం కూడా జరుగుతుందని జగన్ అన్నారు. ఎన్ని జరిగినా తాను నమ్ముకున్నది ప్రజలనేనని అన్నారు. ప్రజలకు మంచిని చేసే వారిని ఎన్నుకోవాలని పిలుపు నిచ్చారు. అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
Next Story