Mon Dec 23 2024 13:20:57 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : పొత్తులు.. ఎత్తులే చంద్రబాబుకు ఆధారం
ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు పొత్తులు, ఎత్తులు, కుయుక్తుల మీద ఆధారపడతారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు
ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు పొత్తులు, ఎత్తులు, కుయుక్తుల మీద ఆధారపడతారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పలాసలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. తాను ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చి ఉంటానని అన్నా ఈ దుష్టచతుష్టయం ఏడుస్తుందని అన్నారు. నాన్ లోకల్స్ చెప్పినట్లే ఈ రాష్ట్రంలో జరగాలంటారన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా పేదలకు ఏమీ చేయలేని వీళ్లు.. తమ ప్రభుత్వం మంచి చేస్తుంటే ఏడుస్తుంటారని జగన్ అన్నారు. చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉండి ఉత్తరాంధ్రకు ఏమైనా మంచి చేశారా? అని జగన్ ప్రశ్నించారు. వాళ్ల అబద్ధాలను మూడు నెలలు మాత్రమే భరించాలని, స్పష్టమైన తీర్పు ఇవ్వాలని జగన్ కోరారు. రానున్న కాలంలో వాళ్లు వచ్చి ఎన్నో అబద్ధాలు చెబుతారని, ప్రతి ఇంటికి కిలో బంగారం, బెంజి కారు ఇస్తామని చెబుతారని, అలాంటి వారిని నమ్మవద్దని జగన్ కోరారు.
బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా...
చంద్రబాబు చివరకు తన కుప్పం నియోజకవర్గంలోనూ నీళ్లు ఇవ్వలేదన్నారు. ఎన్నికలు వచ్చేసరికి దత్తపుత్రుడి మీద ఆధారపడతారని జగన్ అన్నారు. తెలంగాణలో తాను పుట్టనందుకు దత్తపుత్రుడు బాధపడిపోతున్నానని ఎన్నికల సందర్భంగా చెప్పారు. నాన్ లోకల్ స్టార్ చంద్రబాబుకు పార్టనర్ అని జగన్ అన్నారు. ఆంధ్రపాలకులకు చుక్కలు చూపిస్తానని ప్యాకేజీ స్టార్ తెలంగాణలో డైలాగులు కొడతాడని అన్నారు. తెలంగాణలో పోటీ పెడితే అక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్దమనిషికి రాలేదన్నారు. ఏపీలో ఇద్దరికీ ఒక సొంత నియోజకవర్గం కూడా లేదన్నారు. ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమం వస్తుందన్నా వీళ్లు ఏడుస్తారని జగన్ అన్నారు. ఈ రాష్ట్రంలో దొంగల ముఠాగా తయారై దోచుకుని తింటానికి ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారని జగన్ మండిపడ్డారు.
కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా...
ఉద్దానం ప్రధానమైన సమస్య తీర్చినందుకు సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కిడ్నీ వ్యాధులు సంక్రమించకుండా శాశ్వత పరిష్కారం చూపినందుకు గర్వపడుతున్నానని అన్నారు. ఉద్దానం అంటేనే ఉద్యానవనం అని.. దానిని అలాగే చూడాలని తాను భావించానని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేశానని, ఇది తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలందించేందుకు ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడే రానున్న రెండు నెలల్లో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా చేసేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు. అన్ని రకాలుగా ఇక్కడే కిడ్నీ వ్యాధులకు సంబంధించి వైద్య సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక ఇక్కడి నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా, ఇక్కడే అత్యాధుని సౌకర్యాలు కల్పించనున్నట్లు జగన్ ప్రకటించారు.
Next Story