Mon Dec 23 2024 05:40:37 GMT+0000 (Coordinated Universal Time)
చిన్నారుల ప్రాణం తీసిన నేరేడు పండ్లు
నేరేడు పండ్లను తన ఇద్దరు చిన్నారులు హర్ష, అంజిలకు ఇచ్చింది.
చిన్నారులు ఏ వస్తువులు నోట్లో పెట్టుకుంటూ ఉన్నారో.. మనం ఓ కంట కనిపెడుతూ ఉండాలి. మనం కాస్త పట్టించుకోకుండా ఉన్నా.. చాలా ఇబ్బందులే తలెత్తే అవకాశం ఉంది. ఏకంగా ప్రాణాలే పోయే అవకాశం ఉంటుంది. కర్నూలు జిల్లా కోసిగిలో నేరేడు పండ్లు తిని ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
కోసిగి మూడోవార్డులో నాలుగు రోజుల క్రితం బూగేని మాదేవి అనే మహిళ తన అత్త తెచ్చిన నేరేడు పండ్లను తన ఇద్దరు చిన్నారులు హర్ష, అంజిలకు ఇచ్చింది. వాళ్లతో పాటు ఆడుకుంటున్న మరో బాలుడు శ్రీరాములు కూడా ఆ పండ్లను తీసుకుని తిన్నాడు. కొన్ని పండ్లను చిన్నారుల తల్లి మాదేవి కూడా తిన్నది. కాసేపటికే నలుగురు చిన్నారులు స్పృహ కోల్పోయారు. వెంటనే వారిని కుటుంబీకులు ఆదోనీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నేరేడు పండ్లను తిన్నరోజే హర్ష అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. మంగళవారం నాడు అస్వస్థతకు గురైన చిన్నారుల్లో అంజి అనే నాలుగేళ్ల చిన్నారి కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నరసప్ప అనే రైతు పొలం నుంచి మాదేవి అత్త నరసమ్మ ఈ నేరేడు పండ్లను తీసుకొచ్చింది. ఈ పండ్లను తిన్న తర్వాతే చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. క్రిమిసంహారక మందులకు సంబంధించిన కవర్లో నేరేడుపండ్లు తీసుకురాగా.. ఆ పండ్లను కడగకుండా అలాగే తినడంతోనే ఇలా అస్వస్థతకు గురైనట్లు అధికారులు గుర్తించారు.
Next Story