Tue Nov 05 2024 14:56:23 GMT+0000 (Coordinated Universal Time)
నారాయణ బెయిల్ రద్దుచేయాలంటూ పోలీసుల రివిజన్ పిటిషన్
నారాయణకు మంజూరు చేసిన బెయిల్ ను రద్దుచేయాలని చిత్తూరు జిల్లా పోలీసులు న్యాయస్థానంలో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.
చిత్తూరు : మాజీమంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను మే 11న ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి చిత్తూరుకు తరలించారు. ఏపీలో 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీలో నారాయణ హస్తం ఉందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నారాయణను అరెస్ట్ చేయగా.. మర్నాడే ఆయన బెయిల్ పై బయటికొచ్చారు. ఈ నేపథ్యంలో నారాయణకు మంజూరు చేసిన బెయిల్ ను రద్దుచేయాలని చిత్తూరు జిల్లా పోలీసులు న్యాయస్థానంలో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. చిత్తూరు న్యాయస్థానం మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ.. పోలీసుల తరఫున రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
నారాయణకు కోర్టు ఇచ్చిన బెయిల్ చట్టవిరుద్ధమన్నారు ప్రభుత్వం తరపు న్యాయవాది సుధాకర్ రెడ్డి. చట్టం దృష్టిలో అందరూ సమానమేనన్న ఆయన.. 435, 437, సెక్షన్ 18 పీఆర్సీ కింద సొంత పూచీకత్తుపై న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం న్యాయబద్ధంగా లేదన్నారు. ఆయనను రిమాండ్ చేయకుండా.. బెయిల్ ఇవ్వడం సమంజసం కాదన్నారు. టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ముద్దాయిలు ఇచ్చిన పత్రంలో నారాయణ పాత్ర చాలా స్పష్టంగా ఉందన్నారు.
Next Story