Thu Dec 19 2024 14:41:11 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో మహిళలు టిక్కెట్ లేని ప్రయాణం ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నేడు క్లారిటీ రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అధికారులతో సమీక్షించనున్నారు
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నేడు క్లారిటీ రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రవాణా శాఖ అధికారులతో సమీక్ష చేయనున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న చంద్రబాబు నేరుగా అమరావతికి చేరుకుని ఉదయం పదకొండు గంటలకు అధికారులతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సమీక్ష చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తును అధికారులు పూర్తి చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తే బస్సుల సంఖ్యతో పాటు ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందన్న అంచనాలను రూపొందించారు.
ఈ బస్సుల్లోనే...
ఏడాదికి ఆర్టీసీకి అయ్యే ఈ ఖర్చును ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది. ఎందుకంటే అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉండటంతో ఉచిత బస్సు ప్రయాణం మరింత ఆర్థికంగా ఆర్టీసీని దెబ్బతీస్తుందని అధికారులు నివేదిక రూపొందించినట్లు తెలిసింది. ప్రధానంగా ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ ఉచితం ప్రకటిస్తే మంచిదని సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సులతో పాటు, విజయవాడ, విశాఖ వంటి అర్బన్ ప్రాంతాల్లో తిరిగే సిటీ సర్వీసుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు పర్చే యోచనలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న బస్సుల సంఖ్య ఉచిత బస్సు పథకం అమలుతో సరిపోవన్నది అధికారుల వాదనగా ఉంది.
పూర్తి వివరాలతో...
కొత్త బస్సుల కొనుగోలుకు ఎంతవుతుంది? ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ పై భారమెంత? అన్నదానిపై పక్కా లెక్కలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు అధికారులు వెళుతున్నారు. ఏడాదికి 250 కోట్ల రూపాయల భారం పడే అవకాశముందని ప్రాధమికంగా అంచనా వేశారు. ఇప్పటికే రవాణా, ఆర్టీసీ అధికారులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు బృందాలుగా వెళ్లి అక్కడ జరుగుతున్న తప్పొప్పులను, అలాగే మంచి విషయాలను కూడా అధ్యయనం చేసి రావడంతో దీనిపై నేడు విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు తెలిసింది. అంతా ఓకే అయితే ఆగస్టు 15వ తేదీ నుంచి కానీ, లేక మరుసటి రోజు నుంచి కానీ ఈ ఉచిత బస్సు పథకం ఆంధ్రప్రదేశ్ లో అమలులోకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు.
Next Story