Mon Dec 23 2024 01:10:06 GMT+0000 (Coordinated Universal Time)
జగనన్న తోడు.. ఖాతాల్లోకి రూ.549.70 కోట్లు విడుదల
జగనన్న తోడు పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15,87,492 మంది లబ్ధిపొందారు. 6 విడతలలో రూ.2406.09 కోట్ల రుణాలను..
చిరు వ్యాపారులకు చేయూతను అందించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం "జగనన్న తోడు". ఈ పథకం ద్వారా ఇప్పటికి ఆరు విడతలుగా చిరు వ్యాపారులకు ప్రభుత్వం రుణాలు అందజేసింది. ఇప్పుడు ఏడో విడత రుణాలను అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక విడత రుణం తీసుకుని తిరిగి చెల్లించిన లబ్ధిదారులకు వారి వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు వారి బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తుంది. తీసుకున్న రుణాలను నిర్ణీత కాల వ్యవధిలో చెల్లించిన వారికి మళ్లీ కొత్తగా ఇచ్చే రుణాలను పెంచి అందిస్తోంది.
జగనన్న తోడు పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15,87,492 మంది లబ్ధిపొందారు. 6 విడతలలో రూ.2406.09 కోట్ల రుణాలను అందజేయగా.. తాజా రుణాలతో కలిపి రూ.2,955 కోట్లు లబ్ధిదారులకు అందజేయనున్నారు. నేడు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ఏడో విడత నిధులను విడుదల చేశారు. 5,10,412 మందికి ప్రభుత్వం మరో విడత వడ్డీ లేని రూ.549.70 కోట్ల రుణాలను అందజేయడంతో పాటు గతంలో ఈ పథకం ద్వారా రుణాలు పొంది.. సకాలంలో చెల్లించిన వారికి రూ.11,03,32,202 కోట్ల వడ్డీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఏడో విడత జగనన్న తోడు కార్యక్రమంలో అందజేసే వడ్డీతో కలిపి ఇప్పటి వరకూ 15.31 లక్షల మంది చిరువ్యాపారుల బ్యాంకు ఖాతాల్లో రూ.74.09 కోట్ల వడ్డీ డబ్బులు జమచేసినట్లు అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ మాట్లాడుతూ.. జగనన్న తోడు ద్వారా రుణాలు పొందుతున్న వారిలో 80 శాతం మహిళా లబ్ధిదారులే ఉన్నారని తెలిపారు. చిరువ్యాపారులకు వర్కింగ్ క్యాపిటల్ రుణ బాధల్ని తగ్గించేందుకే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చామన్నారు. ఏడోవిడత కార్యక్రమంలో కొత్తగా 56 వేల మందికి జగనన్న తోడు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం తరపున ఎవరికి ఎలాంటి లబ్ధి రావాలన్నా.. వెంటనే ఆయా వార్డు, గ్రామ వాలంటీర్లను సంప్రదించాలని సీఎం జగన్ తెలిపారు.
Next Story