Mon Dec 23 2024 14:27:39 GMT+0000 (Coordinated Universal Time)
ఇక రైతులే విద్యుత్ బిల్లులు చెల్లిస్తారు : సీఎం జగన్
రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో.. భారీగా విద్యుత్ ను కొనుగోలు చేసినట్లు అధికారులు సీఎం జగన్ కు..
తాడేపల్లి : ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్ ను అందిస్తున్న ప్రభుత్వం.. వాటికి సంబంధించిన బిల్లులను కట్టేది. కానీ ఇకపై రైతులే విద్యుత్ బిల్లులు చెల్లిస్తారని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రైతులపై మరో భారం మోపుతున్నారు అనుకుంటే పొరపాటే. రైతులకు ఉచిత విద్యుత్కు సంబంధించి వైసీపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం కీలక ప్రకటన చేశారు. బుధవారం ఇంధన శాఖపై సమీక్ష నిర్వహించగా.. ఉచిత విద్యుత్ అంశంపై జగన్ మాట్లాడారు.
ఇకపై ఉచిత విద్యుత్ కు చెందిన డబ్బును నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని, వాటితో విద్యుత్ బిల్లులను రైతులే చెల్లిస్తారని జగన్ వివరించారు. ఇది అమలైతే విద్యుత్ సేవలకు సంబంధించి రైతు ప్రశ్నించగలుగుతాడని పేర్కొన్నారు. ఈ సమీక్షలో.. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్. సప్లై, పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్లో చేపట్టనున్న ప్రాజెక్టులు తదితర అంశాలను జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో.. భారీగా విద్యుత్ ను కొనుగోలు చేసినట్లు అధికారులు సీఎం జగన్ కు వివరించారు. ఈ ఏడాది మార్చి నెలలో 1268.69 మిలియన్ యూనిట్లను రూ.1123.74 కోట్లు వెచ్చించి కొన్నామని అధికారులు తెలిపారు. అలాగే ఏప్రిల్ నెలలో 1047.78 మిలియన్ యూనిట్లను రూ.1022.42 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
ఏపీలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఫలితంగా రోజుకు 6-8 గంటల పాటు కరెంటు కోతలు విధించారు అధికారులు. ముఖ్యంగా పల్లెల్లో రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా ఆపివేయడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో.. ఏసీలు, మోటార్ల వాడకాలను తగ్గించాలని డిస్కం అధికారులు సూచించారు. విద్యుత్ ను అవసరానికి మించి వాడితే.. భవిష్యత్ లో తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
Next Story