Fri Nov 22 2024 21:24:49 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతిలో "పట్టా"భిషేకం
గుంటూరు జిల్లాకు చెందిన 23,762 మందికి, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 27,031 మందికి పట్టాలు అందించనున్నారు.
ఏపీ ప్రభుత్వం నేడు అమరావతిలో పేదలకు "పట్టా"భిషేకం చేయనుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్లపట్టాల పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజధానిలో 50 వేల మంది పేదలకు సొంతింటి కల నెరవేరబోతోంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు వెంకటపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు.
ఈ బహిరంగసభకు 50 వేల మంది లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 2 లక్షల మంది వరకూ వస్తారని అంచనా. సీఆర్డీఏ పరిధిలో ఉన్న ఆర్-5 జోన్ లో 50,793 మంది మహిళలకు సీఎం జగన్ నేడు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. "నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు" పథకం కింద ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన 23,762 మందికి, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 27,031 మందికి పట్టాలు అందించనున్నారు. వీరికి సీఆర్డీఏ పరిధిలోని 1402 ఎకరాల్లో 25 లేఔట్లు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఫ్లాట్ కు హద్దులు నిర్ణయిస్తూ 80 వేల హద్దు రాళ్లను కూడా ఏర్పాటు చేశారు. రూ.2000 కోట్లతో నిర్మించే వైఎస్సార్ జగనన్న కాలనీలో అంతర్గత రవాణా కోసం 95.16 కిలోమీటర్ల మేర గ్రావెల్ రోడ్లు వేశారు.
రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని వెంకటపాలెంలో వేదికగానే సీఎం ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,43,000 మంది నిరుపేద లబ్ధిదారులకు 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లను అన్ని హక్కులతో రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.1 కే అందజేస్తోంది. దీని ద్వారా రూ.9,406 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. టిడ్కో లబ్ధిదారులు చెల్లించాల్సిన ముందస్తు వాటా సొమ్ములో 50 శాతం రాయితీ కూడా ఇచ్చింది.
Next Story