Fri Nov 15 2024 05:59:23 GMT+0000 (Coordinated Universal Time)
జూన్ 1న పత్తికొండకు సీఎం జగన్
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ పోలీసు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 1న పత్తికొండకు వెళ్లనున్నారు. మే 30వ తేదీన సీఎం పత్తికొండలో జరిగే రైతు భరోసా సభకు హాజరు కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాలతో జూన్ 1వ తేదీకి షెడ్యూల్ ను మార్చారు. ఈ మార్పును అధికారులు, ప్రజలు గమనించాలని కోరారు. జూన్ ఒకటో తేదీకి సంబంధించి సీఎం పర్యటన వివరాలను సీఎంఓ కార్యాలయం వెల్లడించింది.
జూన్ 1వ తేదీన 8.20 గంటలకు సీఎం ఇంటి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు ముఖ్యమంత్రి చేరుకుంటారు. 9.20 గంటలకు విమానంలో ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ 9.30 గంటల వరకు ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. 10 గంటలకు హెలికాప్టర్ లో పత్తికొండకు చేరుకుని 10.10 గంటలకు రోడ్డు మార్గాన సభావేదికకు వెళ్తారు. 10.25 గంటలకు సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సభా వేదిక ప్రాంగణానికి చేరుకుని 10.35 గంటల వరకు ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకిస్తారు. 10.40 గంటలకు సభా వేదికపైకి వస్తారు. మంత్రులు ఎమ్మెల్యేలు ప్రసంగించిన అనంతరం 11.15 నుంచి 11.50 మధ్య సీఎం ప్రసంగం ఉంటుంది. 11.55 గంటలకు రైతు భరోసా నిధులను బటన్ నొక్కి అర్హుల జాబితాలో డబ్బులు జమ చేస్తారు. 12.05 నుంచి 12.35 గంటల వరకు పలువురు నాయకులతో మాట్లాడతారు. 12.40 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పత్తికొండ నియోజకవర్గ కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో చేపట్టిన సీఎం పర్యటన ఏర్పాట్లను శుక్రవారం డీఐజీ జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్తో కలిసి పరిశీలించారు. హెలిప్యాడ్, పోలీసు బందోబస్తు, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అన్నారు డీఐజీ సెంథిల్ కుమార్. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ముఖ్యమంత్రి బహిరంగ సభకు వచ్చే ముఖ్యమైన రహదారులను, రూట్ బందోబస్తులను పరిశీలించారు. పోలీసు అధికారులకు, సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు.
Next Story