Mon Dec 23 2024 02:35:00 GMT+0000 (Coordinated Universal Time)
అమిత్ షాతో గంటపాటు భేటీ.. ఆ విషయం మీదేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. వీరి మధ్య దాదాపు గంటపాటు కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలతో పాటు వివిధ అంశాలపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశానికి కూడా సీఎం జగన్ హాజరయ్యారు. సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి ఎన్డీఏ కు మరింత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తూ ఉన్నారని ఏపీలో చర్చించుకుంటూ ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత మొదటిసారి సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం కూడా హాట్ టాపిక్ గా మారింది.
ఢిల్లీ పర్యటనలో ఇప్పటికే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులను కూడా సీఎం జగన్ కలిశారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, పోలవరం నిధులు తదితర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. భేటీ సమయంలో జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి ఉన్నారు. నిర్మలా సీతారామన్‌కు జగన్ శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని నేడు రాష్ట్రానికి తిరిగి రానున్నారు.
Next Story