Fri Nov 22 2024 19:16:31 GMT+0000 (Coordinated Universal Time)
బందరు పోర్టు పనులకు సీఎం శంకుస్థాపన.. 25 వేలమందికి లబ్ధి
పోర్టు నిర్మాణం కోసం భూ సేకరణ, ఇతర అనుబంధ పోర్టులతో కలిసి ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.5,155.73 కోట్లు ఖర్చవ్వనున్నట్లు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు మచిలీపట్నంలో పర్యటిస్తున్నారు. మచిలీపట్నం మండలం తపసిపూడి గ్రామంలో పోర్టు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పోర్టు నిర్మాణం కోసం భూ సేకరణ, ఇతర అనుబంధ పోర్టులతో కలిసి ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.5,155.73 కోట్లు ఖర్చవ్వనున్నట్లు తెలుస్తోంది. 35.12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో రెండు జనరల్ కార్గోకు, ఒకటి బొగ్గుకు, మరొకటి మల్టీ పర్పస్- కంటైనర్ తో ఎగుమతి, దిగుమతులకు ఉపయోగపడేలా మొత్తం నాలుగు బెర్తులతో నిర్మాణం చేపట్టనున్నారు. మచిలీపట్నం పోర్టును 24-30 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పనులు పూర్తయ్యాక పోర్టు ద్వారా 25 వేలమందికి ఉపాధి లభించనుందని సమాచారం.
పోర్టు వ్యాపార కార్యకలాపాలు పెరిగే కొద్ది.. 16 బెర్తులతో 116 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ పోర్టు నిర్మాణం పూర్తయితే కృష్ణాజిల్లా ముఖచిత్రం మారుతుందని స్థానిక వైసీపీ నేతలు, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ బందరు పోర్టు నిర్మాణ పనులకు జగన్ తో కలిసి ముగ్గురు సీఎంలు శంకుస్థాపనలు చేశారు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు శంకుస్థాపనలకే పరిమితం చేసిన నిర్మాణ పనులు.. ఇప్పుడైనా ఊపందుకుంటాయో లేక.. నాలుగురోజులు చేసి గాలికొదిలేస్తారో చూడాలి.
Next Story