Tue Nov 05 2024 08:08:05 GMT+0000 (Coordinated Universal Time)
సరిహద్దు జిల్లాల్లో అలెర్ట్ గా ఉండాలి : సీఎం జగన్
ఏపీ ప్రభుత్వం తరపున ప్రమాద స్థలానికి మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐపీఎస్ ల బృందాన్ని పంపించారు. క్షతగాత్రులు..
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులు, జిల్లాల కలెక్టర్లతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఎంక్వైరీ విభాగాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే ఘటనా ప్రాంతానికి వెళ్లేందుకు అంబులెన్సులను సిద్ధం చేయాలని సూచించారు. ఎమర్జెన్సీ సేవల కోసం విశాఖ సహా ఒడిశా సరిహద్దు జిల్లాల్లో ఆసుపత్రులు అలర్ట్ గా ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ఏపీ ప్రభుత్వం తరపున ప్రమాద స్థలానికి మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐపీఎస్ ల బృందాన్ని పంపించారు. క్షతగాత్రులు, మృతుల్లో ఏపీకి చెందిన వారు ఉన్నారో లేదో అన్నదానిపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో ఏపీ నుంచి సుమారు 120 మంది ప్రయాణికులు వెళ్లినట్లు సమాచారం. వారిలో 21 మంది సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. పలువురికి గాయాలయ్యాయని అధికారులు చెబుతున్నారు. బాధితుల బంధువులు తమవారి క్షేమ సమాచారం కోసం హెల్ప్ లైన్లను ఆశ్రయిస్తున్నారు.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ ప్రమాదంపై అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులతో జరిగిన సమావేశంలో ప్రమాదం ఎలా జరిగింది ? ఎంత ప్రాణ నష్టం జరిగిందన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైలు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సమావేశం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి బాలాసోర్ కు హెలికాఫ్టర్ లో బయల్దేరారు. ప్రమాద స్థలిని పరిశీలించి, కటక్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు.
Next Story