Tue Nov 05 2024 14:47:00 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మచిలీపట్నంకు జగన్.. పోర్టుపనులకు మరోసారి భూమిపూజ
భూమి పూజ అనంతరం జరిగే సభకు స్థానిక వైసీపీ నేతలు జనసమీకరణ చేస్తున్నారు. పట్టణంలోని వార్డులు, చుట్టుపక్కల గ్రామాల..
కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో నిర్మించ తలపెట్టిన పోర్టు (బందరు పోర్టు) పనులకు భూమి పూజ చేసేందుకు నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి మచిలీపట్నం వెళ్లనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తపసి పూడి గ్రామంలో భూమి పూజ చేసి పైలాన్ ను ఆవిష్కరిస్తారు. అనంతరం మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్ సెంటర్ లోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
భూమి పూజ అనంతరం జరిగే సభకు స్థానిక వైసీపీ నేతలు జనసమీకరణ చేస్తున్నారు. పట్టణంలోని వార్డులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేశారు. బందరు పోర్టును నిర్మించేందుకు రూ.5,155.12 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఈ పోర్టు కోసం ప్రభుత్వం బ్యాంకు నుండి 75 శాతం రుణం, ప్రభుత్వ ఖజానా నుంచి 25 శాతం ఖర్చు చేయనుంది.
పోర్టు నిర్మాణ పనులు నాలుగు విడతలుగా జరగనుంది. కార్గో, కంటైనర్, కోల్ బెర్త్ నిర్మించనున్నారు. అవి పూర్తయ్యాక 12 బెర్త్ ల నిర్మాణం జరగనుంది. ఈ పోర్టు నిర్మాణం పూర్తయితే.. బందరు దిశే మారిపోనుంది. 80 వేల టన్నుల బరువైన షిప్పులు కూడా సురక్షితంగా పోర్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
ఎంతమంది చేస్తారు ?
కాగా.. బందరు పోర్టు నిర్మాణ పనులకు భూమి చేసిన వారిలో జగన్ మూడవ సీఎం. 2008 ఏప్రిల్ 23న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చినకరగ్రహారం పంచాయతీ పరిధిలోని పల్లిపాలెం వద్ద తొలిసారి శంకుస్థాపన చేశారు. కానీ.. నిర్మాణ పనులు మొదలు కాలేదు. అదే పోర్టు నిర్మాణానికి 2019 ఫిబ్రవరి 7న టీడీపీ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు మేకవానిపాలెం వద్ద రెండోసారి శంకుస్థాపన చేశారు. అప్పుడు కూడా పోర్టు నిర్మాణ పనులు కార్యరూపం దాల్చలేదు. అదిగో ఇదిగో అంటూ.. కాలయాపన జరిగిపోయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి శంకుస్థాపన చేసేందుకు సీఎం జగన్ వస్తున్నారు. ఇప్పటికైనా పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయా ? అనేది ఇక్కడి ప్రజల ప్రశ్న. ఈ పోర్టుపైనే 15 ఏళ్లుగా ఆశలు పెట్టుకుని ఉన్నారు.
Next Story