Fri Nov 22 2024 09:09:01 GMT+0000 (Coordinated Universal Time)
పశ్చిమ గోదావరిలో ఒమిక్రాన్ టెన్షన్.. ఇప్పటి వరకూ ఎన్నికేసులంటే !
గడిచిన 45 రోజుల్లో 6,856 మంది విదేశాల నుంచి జిల్లాకు వచ్చారని తెలిపారు. వారందరికీ ఎయిర్ పోర్టులోనే ఆర్టీపీసీ ఆర్ టెస్టులు నిర్వహించగా..
పశ్చిమ గోదావరి జిల్లా వాసుల్లో ఒమిక్రాన్ గుబులు రేపుతోంది. ఇప్పటి వరకూ జిల్లాలో ఎన్ని ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి ? ఎంతమంది విదేశాల నుంచి వచ్చారు ? ప్రైమరీ కాంటాక్ట్స్ ఫలితాలు.. తదితర వివరాలను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు. ఈనెల 21వ తేదీన ఏలూరు రూరల్ పత్తికోళ్ల లంకకు కువైట్ నుంచి వచ్చిన 41 సంవత్సరాల మహిళకు ఒమిక్రాన్ నిర్థారణ అయినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు ఇదే. కాగా.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, హోమ్ ఐసోలేషన్ లోనే చికిత్స తీసుకుంటున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా గడిచిన 45 రోజుల్లో 6,856 మంది విదేశాల నుంచి జిల్లాకు వచ్చారని తెలిపారు. వారందరికీ ఎయిర్ పోర్టులోనే ఆర్టీపీసీ ఆర్ టెస్టులు నిర్వహించగా.. 14 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. 4,200 మందికి 8 రోజుల అనంతరం మరోసారి టెస్టులు చేయగా.. ప్రైమరీ కాంటాక్ట్స్ నెగిటివ్ అని తేలాయన్నారు. మరో 2600 మందికి 8 రోజుల వ్యవధిలో టెస్టులు చేయాల్సి ఉందని, ఎవరికైనా పాజిటివ్ గా తేలితే సీసీఎంబీ ల్యాబ్ హైదరాబాద్ కు పంపిస్తామని కలెక్టర్ వివరించారు.
Also Read : ఒమిక్రాన్ అలెర్ట్ : రానున్న నాలుగు వారాలు కీలకం
సంక్రాంతి పండుగ నేపథ్యంలో విదేశాల నుంచి జిల్లాకు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని.. అలా బయటి దేశాల నుంచి వచ్చినవారెవరైనా ఉంటే 8010968295 నంబరుకు కాల్ చేసి.. సమాచారం ఇవ్వాలని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. 104 కాల్ సెంటర్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తూనే.. టెస్టింగ్, క్వారంటైన్ తదితర అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే పండుగ నేపథ్యంలో గుంపులు గుంపులుగా తిరగరాదని, షాపింగ్ కాంప్లెక్సుల్లోనూ ఎక్కువగా తిరగరాదని సూచించారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.
100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి
జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన వారికి 100 శాతం ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ ను పూర్తిచేశామని తెలిపారు కలెక్టర్ కార్తికేయ మిశ్రా. జనవరి 3వ తేదీ నుంచి 15 నుంచి 18 సంవత్సరాల లోపు వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలుపెడతామని తెలిపారు. నిర్దేశిత వయస్సులోపు పిల్లలు జిల్లాలో 1,78,000 మంది ఉండగా.. వారందరికీ కొవాగ్జిన్ డోస్ ఇవ్వనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అలాగే 60 సంవత్సరాలు పైబడిన వారికి జనవరి 10వ తేదీ నుంచి ప్రికాషనరీ డోస్ ఇవ్వనున్నట్లు వివరించారు.
Next Story