Sun Nov 24 2024 22:10:19 GMT+0000 (Coordinated Universal Time)
రద్దీ కొనసాగుతోంది.. దర్శనానికి ఎన్నిగంటలంటే ?
విద్యార్థులకు కూడా వేసవి సెలవులు ముగియనుండటంతో రోజురోజుకూ రద్దీ పెరిగిపోతోంది. బుధవారం (మే31) తిరుమలలో భక్తుల రద్దీ..
కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే.. ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. విద్యార్థులకు కూడా వేసవి సెలవులు ముగియనుండటంతో రోజురోజుకూ రద్దీ పెరిగిపోతోంది. బుధవారం (మే31) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 19 కంపార్టుమెంట్లు ఫుల్ అయ్యాయి. నేడు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
ఇక మంగళవారం (మే30) 75,871 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపింది. వీరిలో 32,859 మంది భక్తులు శ్రీవారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.27 కోట్లు వచ్చినట్లు టీటీడీ పేర్కొంది. భక్తుల రద్దీ పెరగడంతో అన్నపానీయాలకు లోటు లేకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. తిరుమల గిరులపై ఎక్కడికక్కడ త్రాగునీరు, అన్నప్రసాద వితరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
Next Story