Mon Dec 23 2024 09:35:29 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో రద్దీ తగ్గడంతో స్వామి వారి దర్శనం ఈరోజు సులువుగానే
తిరుమలలో నేడు భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. తిరుమలలో భక్తులు కనిపించకపోవడంతో వీధులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి
తిరుమలలో నేడు భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. తిరుమలలో భక్తులు కనిపించకపోవడంతో వీధులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో స్వామి వారి దర్శనానికి గంటల సమయం పట్టింది. అయితే ఈరోజు తిరుమలలో శ్రీవారిని సులువుగా దర్శించుకునే వీలు కలిగింది. మొన్నటి వరకూ వరస సెలవులు రావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఇప్పుడు సెలవులు పూర్తికావడంతో భక్తుల రద్దీ తగ్గింది. రద్డీ లేకపోవడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమల, తిరుపతి కి చెందిన ఎక్కువ మంది ఈరోజు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు లోకల్స్ ఎక్కువగా స్వామి వారిని దర్శించుకుంటుంటారు.
ఒక కంపార్ట్మెంట్ లోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒకే ఒక కంపార్ట్మెంట్ లోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులు కేవలం రెండు గంటల్లోనే శ్రీవారిని దర్శించుకుంటున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 73,082 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,972 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.46 కోట్ల రూపాయలు వచ్చింది.
Next Story