Fri Apr 04 2025 04:00:34 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ తక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. సహజంగా సోమవారం నుంచి గురువారం వరకూ భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. ప్రతి వారంలో శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రమే భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. నిన్నటి వరకూ అధిక సంఖ్యలో భక్తులు రావడంతో తిరుమల వీధులన్నీ సందడి ఉన్నాయి. నేడు భక్తులు తగ్గడంతో కొంత బోసిపోయి కనిపిస్తున్నాయి. తిరుమల లడ్డూల కౌంటర్ల వద్ద, అన్న ప్రసాదం కేంద్రం వద్ద కూడా భక్తుల రద్దీ అంతగా లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
లడ్డూల తయారీలో...
తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ సంఖ్యలో లడ్డూలను తయారు చేస్తారు. కంపార్ట్ మెంట్లలో ఉండే భక్తుల సంఖ్యను చూసి ఆరోజు లడ్డూల తయారీ సంఖ్యను తగ్గించాలా? వద్దా? అన్నది తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిర్ణయిస్తారు. కొన్ని లడ్డూలను ఇతర ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తుండటంతో వాటితో కలుపుకుని లడ్డూల తయారీ ఉంటుంది. సోమవారం ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
మూడు కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మూడు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 79,705 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,836 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం3.67 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story