Sun Apr 20 2025 12:49:13 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ... దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో నేడు భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు.

తిరుమలలో నేడు భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. నిన్నటి వరకూ వైకుంఠ ద్వార దర్శనాలు ఉండటంతో దాదాపు పది రోజుల పాటు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేందుకు బారులు తీరారు. సంక్రాంతి సెలవులు కూడా పూర్తి కావడంతో పాటు వైకుంఠ దర్శనాలు కూడా ముగియడంతో భక్తుల రద్దీ తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. వైకుంఠ ద్వార దర్శనం జరిగిన పది రోజుల పాటు తిరుమల శ్రీవారి హుండీకి 34 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు ప్రకటించారు.
రేపు టిక్కెట్లు విడుదల...
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రేపు ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవా టిక్కెట్లు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. తిరుమలలో భక్తుల సంఖ్య చాలా రోజుల తర్వాత తక్కువగా కనిపిస్తుందని, స్వామి వారిని సులువుగా భక్తులు దర్శించుకుంటున్నారని అధికారులు తెలిపారు. పెద్దగా వేచి ఉండకుండానే ఏడుకొండల వాడి దర్శనం నేడు లభిస్తుంది.
హుండీ ఆదాయం...
తిరుమలలో సహజంగా సోమ వారం నుంచి గురువారం వరకూ భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. తిరిగి శుక్రవారం నుంచి ఆదివారం వరకూ భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని రెండు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంట లసమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.59 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story