Tirumala : తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. అసలు రీజన్ ఇదేనట
తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. మంగళవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది.
తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. మంగళవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ధనుర్మాసం కావడంతో పాటు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఒకింత రద్దీ పెరిగిందని అధికారులు భావిస్తున్నారు. మామూలుగా ధనుర్మాసంలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని ఎక్కువ మంది ఇష్టపడతారు. ప్రపంచంలోనే ప్రతి ఇంటి దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలోనే ఈ థనుర్మాసంలోనే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలు జరుగుతాయి. తిరుమలలో కూడా దాదాపు కొన్ని రోజుల పాటు ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం లక్షలాది మంది వచ్చి తరిస్తుంటారు. ఉత్తర ద్వార దర్శనం నుంచి స్వామిని దర్శించుకుంటే మంచిదని భక్తులు అభిప్రాయపడతారు. జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరం నుంచి ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుబాటులోకి తెస్తారు. అయినా స్వామి వారిని ఈ మాసంలో దర్శించుకోవడం ఉత్తమమని భావించిన అనేక మంది, ఆ రోజుల్లో వచ్చి ఇబ్బంది పడేకంటే ముందుగానే వచ్చి దర్శనం చేసుకుంటే మంచిదని భావిస్తారు. ఇక విదేశాల నుంచి వచ్చే భక్తులు కూడా ఏడాది చివరి నెల కావడంతో ఎక్కువ మంది తిరుమలకు వస్తారని అధికారులు చెబుతున్నారు.