Mon Dec 23 2024 10:14:14 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం కూడా అంతగా లేదు.. కారణం ఇదేనట
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. బుధవారం కావడంతో భక్తులు తిరుమలకు రావడం లేదు
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. బుధవారం కావడంతో భక్తులు తిరుమలకు రావడం లేదు. దీంతో పాటు శ్రావణమాసం మంచి రోజులు ప్రారంభం కావడం, పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండటంతో తిరుమలలో రద్దీ తగ్గిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. శ్రావణమాసం లో మంచి ముహూర్తాలు నేటి నుంచి ప్రారంభం కానుండటంతో ఇక శుభకార్యాలకే ప్రజలు పరిమితమవుతారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. శ్రీవారి దర్శనం కూడా సులువుగానే లభిస్తుంది. గంటల తరబడి వెయిట్ చేయకుండా దర్శనం లభిస్తుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు వసతి గృహాల వద్ద కూడా పెద్దగా రష్ లేకపోవడంతో అడిగిన వెంటనే వసతి గృహాల కేటాయింపు జరుగుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
రెండు కంపార్ట్మెంట్లలోనే...
ఈరోజు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని రెండు కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం కేవలం రెండు గంటల సమయంలోనూ పూర్తవుతుందని తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 66,235 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,370 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.70 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story