Tue Apr 15 2025 05:58:14 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ అంతగా లేదే.. అదే కారణమా?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా తక్కువగానే ఉంది.శుక్రవారం కూడా భక్తుల రద్దీ తక్కువగా ఉండటం అరుదుగా జరుగుతుంటుంది

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా తక్కువగానే ఉంది.శుక్రవారం కూడా భక్తుల రద్దీ తక్కువగా ఉండటం అరుదుగా జరుగుతుంటుంది. సహజంగా శుక్ర,శని, ఆదివారాల్లో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అయితే ఫిబ్రవరి నెల సమీపిస్తుండటంతో పాటు పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సెలవులన్నీ పూర్తి కావడంతో పాటు పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కారణంగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో కొంత రద్దీ తక్కువగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
హుండీ ఆదాయం...
ఇప్పటికే రోజువారీగా ఎస్.ఎస్.డి. టోకెన్లు విడుదల చేస్తుండటంతో పాటు ముందుగా బుక్ చేసుకున్న భక్తులు తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. హుండీ ఆదాయం కూడా బాగానే ఉందని, భక్తుల సంఖ్యతో సంబంధం లేకుండా తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎప్పటికీ తగ్గదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. భక్తులు తక్కువగా వస్తుండటంతో కొంత లడ్డూ ప్రసాదాల తయారీని తగ్గించినట్లు తెలిసింది. వృదా కాకుండా టీటీడీ ఈ చర్యలు తీసుకుంది.
మూడు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 51,349 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 14,082 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.65 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
.
Next Story