Tue Apr 15 2025 03:08:43 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో ఆదివారం కూడా భక్తుల రద్దీ అంతగా లేదే?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఆదివారం కూడా భక్తుల రద్దీ అంతగా లేదు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఆదివారం కూడా భక్తుల రద్దీ అంతగా లేదు. కంపార్ట్ మెంట్లన్నీ దాదాపు ఖాళీగానే ఉన్నాయి. మాడ వీధులన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. సాధారణంగా ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయినా సరే ఈరోజు రద్దీ లేకపోవడంతో భక్తులు సులువుగానే స్వామి వారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో భక్తులు ఎక్కువ సేపు స్వామి వారి చెంత ఉండే అవకాశాలు నేడు కనిపిస్తున్నాయి. అయితే భక్తుల రద్దీ తక్కువగా ఉందని తెలుసుకున్న స్థానికులు బాలాజీ దర్శనానికి వచ్చే అవకాశముంది.
రథసప్తమికి ఏర్పాట్లు...
మరోవైపు రథసప్తమికి సంబంధించిన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి వేడుకలు పెద్దయెత్తున జరగనుందున అందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట వంటి ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయడానికి సిద్దమవుతున్నారు. వాహన సేవలు కూడా ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశముందని భావించిన టీటీడీ అధికారుల అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎనిమిది గంటల సమయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఆరు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 80,871 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,257 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.78 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story