Sun Dec 22 2024 21:23:05 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : భక్తులకు గుడ్ న్యూస్.. ఆదివారం తిరుమలలో రద్దీ తగ్గిందిగా?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం భక్తులుపెద్దగా లేకపోవడంతో స్వామి వారిని సులువుగా దర్శించుకుంటున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం అయినా భక్తుల రద్దీ పెద్దగా లేకపోవడంతో భక్తులు స్వామి వారిని సులువుగా దర్శించుకుంటున్నారు. అతి తక్కువ సమయంలో తిరుమల శ్రీవారిని కళ్లారా చూస్తున్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇటీవల కాలంలో అనేక రోజుల నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. క్యూ లైన్లయితే బయట వరకూ విస్తరించి గంటల తరబడి దర్శనం కోసం నిరీక్షించాల్సి వచ్చింది. అయితే ఆదివారం నాడు మాత్రం భక్తుల సంఖ్య కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. సాధారణ స్థితికి చేరుకుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదివారం భక్తుల సంఖ్య స్వల్పంగా ఉండటం ఇదే ప్రధమమని అధికారులు చెబుతున్నారు.
ఎనిమిది గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఇరవై ఐదు కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం మాత్రమే పడుతుంది. నిన్నటి వరకూ ఇరవై నాలుగు గంటల సమయం పట్టేది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల్లో పూర్తవుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 82,406 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,151 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.68 కోట్ల రూపాయల వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story