Thu Nov 21 2024 23:54:09 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ నేడు తగ్గింది. భారీ వర్షాలు, వాయుగుండం ప్రభావంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరలేదు
తిరుమలలో భక్తుల రద్దీ నేడు తగ్గింది. భారీ వర్షాలు, వాయుగుండం ప్రభావంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరలేదు. దీంతో పాటు శ్రీవారి మెట్లను కూడా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో తిరుమల పర్యటనను భక్తులు వాయిదా వేసుకున్నారు. పాపవినాశనం, శిలా తోరణం వంటివి కూడా మూసివేశారు. దీంతో భక్తుల సంఖ్య తిరుమలలో స్వల్పంగానే ఉంది. కొన్ని రైళ్లను కూడా అధికారులు రద్దు చేశారు. అలాగే బస్సులు కూడా నిలిపివేశారు. రెండు రోజుల నుంచి తిరుపతి, తిరుమలలో భారీ వర్షం పడుతుండటంతో భక్తులు నిన్న కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. కానీ నేడు అయితే భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గింది.
ఎనిమిది గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఎనిమిది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. అలాగే మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 75,371 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,065 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.21 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
జనవరి కోటా టిక్కెట్లు...
ఈ నెల 19న శ్రీవారి ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్ల జనవరి కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను అక్టోబరు 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబరు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు అక్టోబరు 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. 22వ తేదీన ఆర్జిత సేవా టికెట్ల విడుదల చేయనుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను అక్టోబరు 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. 22న వర్చువల్ సేవల కోటా విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జనవరి నెల కోటాను అక్టోబరు 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
Next Story