Mon Dec 23 2024 09:19:27 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : ద్వారంపూడికి ఇక దబిడి దిబిడేనా? అంతా రెడీ చేస్తున్నారా?
కాకినాడ పట్టణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది
కాకినాడ పట్టణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కాకినాడ పోర్టు నుంచి అక్రమ రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేశారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే దీనిపై విచారణ ప్రారంభమయింది. తాజాగా జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కాకినాడలో రేషన్ బియ్యాన్ని దేశాన్ని దాటించడం గురించి ప్రస్తావించారు. ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యులు పదవుల్లో ఉండి ఈ పనులకు పాల్పడ్డారని పరోక్షంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పరిస్థితి సీరియస్నెస్ కు అద్దం పడుతున్నాయి. అంటే త్వరలోనే దీనిపై కేసులు నమోదయ్యే అవకాశముందంటున్నారు.
లోతుగా విచారణ...
ఇప్పటికే పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలోని పలు గోదాముల్లో దాడులు చేసి ఇప్పటికే రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. అధికారులు ఈ వ్యవహారంపై ప్రత్యేక టాస్క్ గా భావించి గత ప్రభుత్వ హయాంలో కాకినాడ రేవు నుంచి రేషన్ బియ్యాన్ని దేశాన్ని దాటించడంలో సహకరించిన వారిపై చర్యలకు కూడా సిద్ధమయినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన విచారణ పూర్తి స్థాయిలో ప్రారంభమయిందని అంటున్నారు. న్యాయస్థానాల్లో ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా అందుకు తగిన సాక్ష్యాధారాలను సేకరించే పనుల్లో అధికారులు ఇప్పుడు ఉన్నారంటున్నారు.
వ్యక్తిగత విమర్శలు...
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అటు టీడీపీకి, ఇటు జనసేనకు శత్రువు అనే చెప్పాలి. పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆయనను పిఠాపురంలో ఓడించేందుకు ప్రత్యేకంగా నిధులు వెచ్చించారంటారు. అలాగే పవన్ కు బహిరంగ సవాల్ విసిరింది కూడా ద్వారంపూడి మాత్రమే. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలంటూ ఛాలెంజ్ విసిరారు. అధికారంలో ఉండగా జనసైనికులు, వీర మహిళలపై దాడులు చేయించారని, తాము అధికారంలోకి వస్తే తాట తీస్తామని గతంలో పవన్ కల్యాణ్ చేసిన హెచ్చరికలను కూడా ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లపై కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగడంతో అందరి శత్రవుగా ద్వారంపూడి మారారన్న టాక్ వినపడుతుంది.
ప్రత్యేక ఫోకస్....
ఈ నేపథ్యంలోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గత ప్రభుత్వ హాయాంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. తూర్పు గోదావరి జిల్లాలో అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ముకుతాడు వేయాలని పార్టీ పెద్దలు కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో అతి త్వరలోనే ద్వారంపూడి విషయం తేల్చాలన్న ఆదేశాలు ఇప్పటికే పోలీసులతో పాటు పౌరసరఫరాల శాఖ అధికారులకు వెళ్లడంతో వారు అదే పనిలో ఉన్నారని తెలిసింది. మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి విషయంలో మాత్రం త్వరలోనే ఒక న్యూస్ వస్తుందన్నది అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
Next Story