Thu Dec 19 2024 06:48:49 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : దాడులపై నివేదిక కోరిన సర్కార్.. చర్యలకు సిద్ధమయినట్లేనా?
గత ప్రభుత్వంలో జరిగిన దాడులపై ప్రస్తుత ప్రభుత్వం నివేదికలను తెప్పించుకుంటుంది
గత ప్రభుత్వంలో జరిగిన దాడులపై ప్రస్తుత ప్రభుత్వం నివేదికలను తెప్పించుకుంటుంది. ఘటనలకు కారకులైన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వ హాయాంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనను కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అధికారంలోకి రావడంతో దీని వెనక ఉన్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని భావిస్తుంది. ఇప్పటి వరకూ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న దానిపై నివేదికలను హోంశాఖను కోరినట్లు తెలిసింది.
చంద్రబాబు నివాసంలోనూ...
ఈ దాడికి సంబంధించి అప్పట్లో వైసీపీ నేత దేవినేని అవినాష్ పై టీడీపీ నేతలు ఆరోపించారు. అదే సమయంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించిన ఘటనపై కూడా హోంశాఖను నివేదికను కోరినట్లు తెలిసింది. మాజీ మంత్రి జోగిరమేష్ చంద్రబాబు నివాసం వద్దకు వచ్చి హంగామా సృష్టించిన విషయంలో చర్యలకు సిద్ధమయినట్లు తెలిసింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, శ్రేణులపై జరిగిన దాడులపై కూడా సమగ్ర నివేదికను హోంశాఖను కోరినట్లు తెలిసింది. నివేదికలు వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది.
Next Story