Mon Dec 23 2024 10:06:12 GMT+0000 (Coordinated Universal Time)
తుపాను నుంచి కాస్త ఊరట.. కానీ పొంచిఉన్న వరద ముప్పు !
అసని తుపాను ప్రస్తుతం కాకినాడకు 300 కిలోమీటర్లు, విశాఖకు 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, నేటి సాయంత్రం నుంచి..
హైదరాబాద్ : బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా రూపాంతరం చెంది.. ఏపీవైపు దూసుకొస్తోంది అసని సైక్లోన్. నిన్నటి నుంచి ఏపీకి భారీ వర్షసూచన అంటూ.. పలు హెచ్చరికలు జారీ అయ్యాయి. విశాఖ - ఒడిశాల మధ్య తీరందాటే సమయంలో అసని బీభత్సం సృష్టిస్తుందని, ప్రజలు, ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. తాజా ప్రకటనతో తుపాను హెచ్చరికల నుంచి కాస్త ఊరట లభించింది. 'అసని' రేపు సాయంత్రానికి బలహీన పడుతుందని, భూమిని తాకే అవకాశాలు తక్కువని భారత వాతావరణ కేంద్రం ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్ లో వెల్లడించింది.
అసని తుపాను ప్రస్తుతం కాకినాడకు 300 కిలోమీటర్లు, విశాఖకు 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, నేటి సాయంత్రం నుంచి ఎల్లుండి వరకూ 10-20 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తుపాను భూమిని తాకే అవకాశం తక్కువే అయినా.. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిస్తే వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తుపాను గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోందని, ఇప్పటికే విశాఖ సహా.. తీరప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయని తెలిపింది.
కాగా.. అసని తుపాను పూరీకి 70 కిలోమీటర్ల దూరంలోనే కేంద్రీకృతమై ఉన్నట్లు ఒడిశా వాతావరణశాఖ వెల్లడించింది. తుపాను కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఇప్పటికే తమిళనాడులోని చెన్నై, తిరుచురాపల్లి, కడ్డలూరు, పుదుచ్చేరి, సేలం, కరైకల్ లో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షసూచన, ఈదురు గాలుల నేపథ్యంలో ఇప్పటికే పలు విమానాలు రద్దయ్యాయి.
Next Story