Mon Dec 23 2024 13:16:39 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ బీజేపీ చీఫ్ గా పురంధేశ్వరి బాధ్యతలు.. వైసీపీ పై కౌంటర్లు
వైసీపీ పై వరుస విమర్శలు గుప్పించారు. అసలు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులకు, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి పొంతనే..
ఏపీ బీజేపీ చీఫ్ గా దగ్గుబాటి పురంధేశ్వరి నేడు బాధ్యతలు స్వీకరించారు. ఉదయం గన్నవరం చేరుకున్న ఆమె.. విజయవాడ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. వైసీపీ పై వరుస విమర్శలు గుప్పించారు. అసలు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులకు, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి పొంతనే లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీలో అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. ఆంధ్రరాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం నిధుల విషయంలో ఆలస్యమైనా.. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల్ని మరువలేదన్నారు. పోలవరం విషయంలో కేంద్రం ఎప్పుడూ వెనకడుగు వేయదన్న ఆమె.. పోలవరం నిర్మాణం తమ వల్ల కాదనుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతల్ని పూర్తిగా కేంద్రానికి అప్పజెప్పాలన్నారు.
రాష్ట్రంలో రైతులకు కేంద్రం అన్నివిధాలా అండగా ఉందన్నారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందని పురంధేశ్వరి వెల్లడించారు. కేంద్రం రైతులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రాష్ట్రం తమ గొప్పగా చెప్పుకుంటుందని విమర్శించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఆర్బీకే సెంటర్లలోనూ కేంద్రం పాత్ర ఉందన్నారు. రాష్ట్రం నుంచి వచ్చే లెక్కల్లోనే జాప్యం జరుగుతుందని పురంధేశ్వరి పేర్కొన్నారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలో రివర్స్ టెండరింగ్ చేసి, అవినీతికి తావులేకుండా చేస్తానని చెప్పారని, తీరా చూస్తే.. ఇప్పుడు చిన్న చిన్నకాంట్రాక్టర్లపై రివర్స్ టెండరింగ్ ఉపయోగించారన్నారు. ఇప్పటి వరకూ చిన్న చితక కాంట్రాక్టులు చేసేవారికి రూ.40 వేల నుంచి రూ.50 వేల కోట్ల అవుట్ స్టాండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిందన్నారు.
ఏపీలో రోడ్ల పరిస్థితి కూడా చాలా అధ్వాన్నంగా ఉందన్నారు. రాష్ట్రంలో కేంద్రం వేసిన రోడ్లు తప్ప.. రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్లెక్కడున్నాయని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై ప్రశ్నిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తుందని విమర్శించారు.
Next Story