Mon Dec 16 2024 01:45:50 GMT+0000 (Coordinated Universal Time)
Dharmavaram : కొల్లాపూర్ బర్రెలక్క లాగానే ధర్మవరంలోనూ దాసరి కవిత.. పోటీకి సిద్ధం
ఆంధ్రప్రదేశ్ లోని ధర్మవరం నియోజకవర్గంలో పోటీ చేయడానికి దాసరి కవిత సిద్ధంగా ఉన్నారు
కొల్హాపూర్ నియోజకవర్గంలో బర్రెలక్క అలియాస్ శిరీష తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి సంచలనానికి వేదిక అయ్యారు. అందరూ శిరీషకు మద్దతు పలికారు. ఆమె గెలుస్తుందా? ఓడిపోతుందా? అన్నది పక్కన పెడితే ఎన్నికల్లో సంచలనంగా మారింది. ఆమె ఎవరిని ఓడిస్తారన్న దానిపై కూడా పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. ఆమెకు విరాళాలు కూడా భారీగానే వచ్చాయి. ఆమె మద్దతుగా రాజకీయ నేతలు, స్వచ్ఛంద సంస్థలు కూడా నిలిచాయి. బర్రెలక్క అసెంబ్లీలోకి అడుగు పెడుతుందా? లేదా? అన్న అంశం కన్నా ఆమె ధైర్యానికి ఎవరూ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఆమె రాజకీయ నేతలను కాదని, దాడులను ఎదుర్కొని మరీ పోటీకి దిగి ప్రచారంలోనూ దూసుకు వెళ్లిన తీరును అందరూ ప్రశంసిస్తున్నారు.
జుమ్ చక... జుమ్ చక స్టార్ గా...
ఆమె స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది యువత ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వస్తారని వేస్తున్న అంచనాలు నిజమవుతున్నాయి. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లోనూ ఎన్నికలు జరగనున్నాయి. బర్రెలక్క లాగా మరో యువతి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. నిరుద్యోగ సమస్యను అజెండాగా తీసుకుని ఈమె కూడా కదనరంగంలోకి కాలుమోపుతున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో పోటీ చేయడానికి దాసరి కవిత సిద్ధంగా ఉన్నారు. దాసరి కవిత యూట్యూబర్ గా సుపరిచితులు. ఆమెను జుమ్ చక జుమ్ జక స్టార్ గా పేరుంది. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేసి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని ఓడిస్తానని చెబుతున్నారు.
కేతిరెడ్డిని ఓడించడమే...
ఆమెకు ఫాలోయిర్స్ కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. ఆమె యూట్యూబ్ ఛానల్ లో ఎక్కువగా కామెడీ కంటెంట్ ఉండటంతో అధిక మంది ఆకర్షితులయ్యారు. తాను వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తానని ఆమె పెట్టిన పోస్ట్ ను కూడా చాలా మంది లైక్ చేస్తున్నారు. గో అహెడ్ అంటూ కవితను ప్రోత్సహిస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గంలోని డి. చర్లోపల్లికి చెందిన కవిత తనకున్న ఫాలోయింగ్ ద్వారా వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారంటే... బర్రెలక్క స్ఫూర్తి నిచ్చారనే చెప్పాలి. ఆమె లాగా యువతీ, యువకులు ఎన్నికల్లో పోటీ చేసి తాము ఎదుర్కొంటున్న ప్రధాన డిమాండ్లను పరిష్కరించుకునే దిశగా ప్రయత్నించడం మంచిదే అవుతుంది.
Next Story