Mon Dec 23 2024 11:56:51 GMT+0000 (Coordinated Universal Time)
సెటిల్మెంట్లకు దిగిన దస్తగిరి
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో బెయిల్పై ఉన్న ప్రధాన నిందితుడు దస్తగిరి సెటిల్మెంట్లకు తెగబడుతూ ఉండడం
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో బెయిల్పై ఉన్న ప్రధాన నిందితుడు దస్తగిరి సెటిల్మెంట్లకు తెగబడుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. సీబీఐ సిఫార్సుల మేరకు ఐదుగురు గన్మెన్లు ఉన్న దస్తగిరి పోలీస్ స్టేషన్ వద్దే బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నాడు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నడిబొడ్డున సోమవారం పట్టపగలు మూడు షాపులకు తాళాలు వేసిన దస్తగిరి వాటిని ఖాదర్వలీ అనే వ్యక్తికి అప్పగించాలంటూ బెదిరింపులకు దిగాడు.
రైల్వే కోడూరులో అబ్దుల్ వాహిద్, శివయ్యనాయుడు, వైష్ణవి మెడికల్స్కు చెందిన సుబ్బరాయుడికి పోలీస్స్టేషన్ పక్కనే మూడు షాపులున్నాయి. వాటిని 30 ఏళ్లుగా అద్దెకు ఇచ్చారు. వాటి విలువ సుమారు రూ.2.5 కోట్లకు పైబడి ఉంటుంది.ఆ మూడు షాపులు ఖాదర్వలీ అనే వ్యక్తివి అంటూ దస్తగిరి సెటిల్మెంట్లకు దిగాడు. డాక్యుమెంట్లు ఉన్నాయని, మీరంతా ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. సోమవారం మధ్యాహ్నం దస్తగిరి రెండు కార్లలో అక్కడికి చేరుకుని.. ఐదుగురు గన్మెన్లను వెంట బెట్టుకొని ప్రధాన రహదారిలో నడుచుకుంటూ వెళ్లి మూడు షాపులకు తాళాలు వేశాడు. జిరాక్స్ డాక్యుమెంట్లు తీసుకొని 10 రోజుల్లో తిరిగి వస్తానంటూ హెచ్చరించాడు.
ఇదీ వివాదం:
రైల్వేకోడూరు పోలీస్స్టేషన్ పక్కనే సర్వే నెంబరు 659/1లో మూడు భవనాలు ఉన్నాయి. వాటిల్లో దుకాణాలు నడుస్తున్నాయి. రావూరు సుబ్బరా యుడు, మహ్మద్ అరీఫ్, శివయ్యనాయుడుల ఆధ్వర్యంలో ఉన్నాయి. దీనిని తాము కొనుగోలు చేశామని వారు చెబుతున్నారు. అయితే రైల్వే కోడూరుకే చెందిన పి.పఠాన్ కుమార్తె షేక్ ఖాజా మియా, భార్య గౌసియాల నుంచి తాము ఈ స్థలం కొన్నామని మరొకరు ఆధారాలు చూపుతున్నారు. ఈ వ్యక్తి తరపున దస్తగిరి పంచాయతీ కి వచ్చాడని తెలుస్తోంది.
Next Story