Tue Apr 01 2025 19:43:18 GMT+0000 (Coordinated Universal Time)
Kolikapudi : కొలికిపూడి వివాదం నేడు కొలిక్కి వచ్చేనా? చర్యలు తప్పవా?
తెలుగుదేశం పార్టీకి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు డెడ్ లైన్ ముగిసింది.

తెలుగుదేశం పార్టీకి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు డెడ్ లైన్ ముగిసింది. ఇప్పటి వరకూ అయితే పార్టీ అధినాయకత్వం ఆయన చెప్పినట్లుగా రమేష్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? లేక టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా? అన్నది తిరువూరులో మాత్రమే కాదు ఏపీలోనే రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎందుకుంటే ఇప్పటికే టీడీపీ నేత నేత రమేశ్ రెడ్డిపై తీసుకోకపోతే 48 గంటల్లోగా రాజీనామా చేస్తానని రెండు రోజుల క్రితం కొలికపూడి శ్రీనివాసరావు ప్రకటించారు. అధినాయకత్వానికి డెడ్ లైన్ పెట్టారు. ఈరోజు పదకొండు గంటలకు డెడ్ లైన్ పూర్తికానుండటంతో కొలికపూడి ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
రాజధాని రైతులకు...
మరోవైపు పార్టీ హైకమాండ్ కు డెడ్ లైన్ ను విధించడాన్ని అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ముగ్గురు సభ్యులతో నివేదిక తెప్పించిన అధిష్టానం కొలికపూడిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఇటు కొలికపూడి శ్రీనివాసరావు డెడ్ లైన్ ముగుస్తుండటం మరో వైపు అధినాయకత్వం చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారంతో టీడీపీలో ఉగాదికి ముందు ఏం జరగనుందన్నది ఆసక్తిగానూ, ఉత్కంఠగా మారింది. ఎందుకంటే గత ప్రభుత్వ హాయాంలో అమరావతి రాజధాని రైతుల తరుపున పోరాడిన కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ నాయకత్వాన్ని మెప్పించి టిక్కెట్ ను సాధించి విజయం దక్కించుకున్నా వరస వివాదాలు ఆయనను చుట్టుముడుతున్నాయి.
డెడ్ లైన్ పెట్టడమేంటని...
పైగా తాను వివాదాల్లో చిక్కుకుని పార్టీని ఇబ్బందుల్లో నెట్టడమే కాకుండా పార్టీ నాయకత్వానికి డెడ్ లైన్ పెట్టడమేంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన మొండి వైఖరికి ఇది అద్దం పడుతుందన్న వ్యాఖ్యలు పార్టీలో బాగానే వినిపిస్తున్నాయి. ముగ్గురు సభ్యులతో నియమించిన కమిటీ కూడా కొలికపూడి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగానే నివేదిక అందించినట్లు తెలిసింది. అనవసర వివాదాల్లో తలదూర్చడంతో పాటు ఎంపీ కార్యాలయంపై నేరుగా అవినీతి ఆరోపణలు చేయడం, సొంత పార్టీ నేతలతో పాటు దళిత సామాజికవర్గం నేతలను ఇబ్బందిపెడుతూ ఆయన వ్యవహరిస్తున్న తీరును అధినాయకత్వం సీరియస్ గా తీసుకున్నట్లు తెలియవచ్చింది.
తన పంథాలోనే...
అయితే కొలికపూడి శ్రీనివాసరావు కూడా తెగించినట్లే కనపడుతున్నారు. తనను ఇబ్బంది పెట్టేవారిని కాకుండా తనపై పార్టీ కక్ష కట్టిందన్న భావనతో ఆయన ఉన్నట్లు కనిపిస్తుంది. ఎంపీతో పాటు కొందరు ఎమ్మెల్యేలు తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతూ అధినాయకత్వాన్ని తప్పుదోవపట్టిస్తున్నారంటూ ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది. కొలికపూడి శ్రీనివాసరావు మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయినా తాను అనుకున్న పంథాలోనే వెళతానని చెబుతున్నారు కానీ, పార్టీకి కొన్ని లైన్లు ఉంటాయి వాటిని అధిగమించకూడదన్న విషయం తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. సీనియర్ నేతలే హైకమాండ్ నిర్ణయాలకు తలవొంచుతుంటే నిన్న గాక మొన్న వచ్చి ఈ అహంకారమేంటన్న ప్రశ్నలు పార్టీ నాయకత్వం వైపు నుంచి వినపడుతున్నాయి. మొత్తం మీద నేడు కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది.
Next Story