Sun Dec 14 2025 06:04:03 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీకి వత్తాసు పలకకపోతే దాడులా: వైఎస్ జగన్
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (VSP)పై తెలుగుదేశం చేతులెత్తేసిందంటూ

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (VSP)పై తెలుగుదేశం చేతులెత్తేసిందంటూ కథనాన్ని ప్రచురించడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విశాఖపట్నంలోని డెక్కన్ క్రానికల్ వార్తా సంస్థ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. మీడియా సంస్థ పోస్ట్ చేసిన వీడియోలో, ఒక టీడీపీ కార్యకర్త తోటి పార్టీ కార్యకర్తలు రెచ్చగొడుతూ బోర్డును తగలబెడుతున్నట్లు చూడొచ్చు. డెక్కన్ క్రానికల్ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. తన పోస్ట్‌లో పత్రికా స్వేచ్ఛను కోరింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తాము నిష్పక్షపాత ధోరణిలో వార్త ప్రచురించామని, కానీ టీడీపీ గూండాలు తమ కార్యాలయంపై దాడి చేశారని డెక్కన్ క్రానికల్ పత్రిక తెలిపింది.
ఈ దాడి ఘటనపై వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. టీడీపీకి చెందిన వ్యక్తులు పిరికితనంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని.. గుడ్డిగా టీడీపీకి వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంతో పనిచేసే మీడియాను అణచివేసేందుకు జరిగిన మరో ప్రయత్నమే ఈ దాడి అని జగన్ అభివర్ణించారు. కొత్త ప్రభుత్వ హయాంలో ఏపీలో ప్రజాస్వామ్యం పదేపదే ఉల్లంఘనలకు గురవుతోందని, ఏపీ ముఖ్యమంత్రి దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని జగన్ తెలిపారు.
Next Story

