Mon Dec 23 2024 04:29:32 GMT+0000 (Coordinated Universal Time)
సాయంత్రానికి తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం..తీర ప్రాంతాలకు భారీ వర్షసూచన
ఈ తుపాను ప్రభావంతో.. డిసెంబర్ 8న తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతం, కారైక్కాల్ ప్రాంతాల్లో మోస్తరు, అక్కడక్కడా..
బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాలను ఆనుకుని ఉన్న ఈ వాయుగుండం చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. నేటి సాయంత్రానికి ఇది తుపానుగా రూపాంతరం చెందనున్నట్లు ఐఎండీ తెలిపింది. నేటి సాయంత్రం నుంచి తీర ప్రాంత జిల్లాల్లో గాలుల తీవ్రత పెరగనుందని, డిసెంబరు 8 సాయంత్రం నుంచి డిసెంబరు 9వ తేదీ ఉదయం వరకు 100 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, ఆపై క్రమంగా గాలుల వేగం తగ్గుతుందని ఐఎండీ పేర్కొంది. రేపు ఉదయానికి ఈ తుపాను ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరువలోకి రానుంది.
ఈ తుపాను ప్రభావంతో.. డిసెంబర్ 8న తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతం, కారైక్కాల్ ప్రాంతాల్లో మోస్తరు, అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. అలాగే ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. డిసెంబరు 9న ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ హెచ్చరించింది.
డిసెంబర్ 10వతేదీకి తుపాను తీవ్రత కాస్త తగ్గుతుందని, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని వివరించింది. మూడురోజుల వరకూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Next Story