సాగని సాగు . అరకొరగా వ్యవసాయం పనులు!
సాగర్ జలాశయంలో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవు. దీంతో వరిసాగుకు నీరందించే విషయంలో ప్రభుత్వం ఇంతవరకు ప్రకటన చేయలేదు
అరకొరగా వ్యవసాయ పనులు
సాగర్ జలాశయంలో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవు. దీంతో వరిసాగుకు నీరందించే విషయంలో ప్రభుత్వం ఇంతవరకు ప్రకటన చేయలేదు. గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో కుడికాలువ కింద 11 లక్షల ఎకరాల్లో సాగు సమస్యగా ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాలలో కొంతమేరకు నీటి నిల్వలు మెరుగ్గా ఉన్నా కృష్ణా పరివాహక ప్రాంత కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు లేకపోవడంతో ఇన్ఫ్లో పెరగడం లేదు. దీంతో, దిగువకు నీటి విడుదల జరగడం లేదు. ఆల్మట్టి నుంచి వరద ప్రవాహం దిగువకు రాకపోవడంతో గత రెండు నెలలుగా సాగర్ జలాశయంలో నీటి నిల్వ పెరగలేదు. గతేడాది ఇదే సమయానికి కృష్ణా పరివా హక ప్రాంత అన్ని జలాశయాల్లోనూ నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. మరోవైపు సాగర్ ఆయకట్టు పరిధిలో దాదాపు 30 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, పత్తి పంట ఇతర పంటలపై రైతులు దృష్టి సారించే పరిస్థితి లేదు. సాగర్ జలాశయంలో నీరులేకపోవడంతో పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఈ ఏడాది మిర్చి సాగు కూడా ఇంతవరకూ ఊపందుకోలేదు. మిర్చికి తప్పనిసరిగా రెండు మూడు నీటి తడులు అవసరం. ఆగస్టు మూడవ వారం వచ్చినా ఇంతవరకు 50 శాతం కూడా సాగు జరగలేదు.
గతేడాది ఆగస్టు మొదటి వారంలోనే కృష్ణా డెల్తా, సాగర్ ఆయకట్టుకు నీరు రావడం ప్రారంభమైందని, ఈ ఏడాది ఆల్మట్టి నుంచి నీటి విడుదల జరిగితేనే సాగర్ ఆయకట్టు రైతులు వ్యవసాయపనులు చేపడతారని, అప్పటి వరకు వేచిచూడక తప్పదని అధికారులు చెప్తున్నారు.