Mon Mar 31 2025 08:13:50 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : "పిఠాపురం"పై పవన్ ఫోకస్ పెట్టడం లేదా? మౌనమే అంగీకారమా?
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనిపిస్తుంది.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనిపిస్తుంది. అన్నీ తెలిసి మౌనంగా ఉంటున్నారా? లేక వాటంతట అవే సర్దుకుంటాయని భావిస్తున్నారో తెలియదు కానీ పవన్ కల్యాణ్ మౌనం మాత్రం పిఠాపురం టీడీపీ నేతలకు ఎక్కడో కాలుతున్నట్లే కనపడుతుంది. వరస గా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే పవన్ కల్యాణ్ కు అన్నీ తెలిసి జరుగుతున్నాయని అనుకోవాలని తెలుగు తమ్ముళ్లు భావిస్తుంటే, పవన్ వస్తే అంతా సెట్ రైట్ అవతుందని జనసైనికులు చెబుతున్నారు. అసలు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎందుకు జనసేన నేతలు ఇంత కాంట్రవర్సీతో కొని తెచ్చుకుంటున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ముందు నుంచే...
పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభకు ముందు నుంచే టీడీపీ, జనసేనల మధ్య వార్ ప్రారంభమయినట్లు కనిపిస్తుంది. ఎలాగంటే మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ పిఠాపురం అంటే పవన్ కల్యాణ్ అడ్డా అని అనడం, అక్కడ మరో నేతకు అవకాశం లేదని చెప్పడం వివాదంగా మారింది. నాదెండ్ల మనోహర్ అలాంటి వ్యాఖ్యలు చేశారంటే పవన్ కల్యాణ్ కు తెలియకుండా చేశారని అనుకోలేం. అందులో పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఏం మాట్లాడినా జనసేన నేతలు ఆచితూచి మాట్లాడతారు. నాదెండ్ల మనోహర్ పవన్ కల్యాణ్ అడ్డా పిఠాపురం అనడంతో వర్మతో పాటు అనేక మంది టీడీపీ నేతలకు కొంత ఇబ్బందికరంగా మారింది.
ఆవిర్భావ సభలోనూ...
తర్వాత ఆవిర్భావ సభలోనూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యాన్ని పోశాయి. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపునకు పవన్ ఒక కారణమయితే, జనసేన క్యాడర్ మరో కారణమని, ఎవరైనా తామే పవన్ విజయానికి కారణమని భావిస్తే వారి ఖర్మ అని చేసిన వ్యాఖ్యలు వర్మతో పాటు టీడీపీ స్థానిక నేతల్లో గునపాలు దిగినట్లయింది. దీంతో పాటు అదే సభలో పవన్ కల్యాణ్ కూడా టీడీపీని అధికారంలోకి తెచ్చామని చెప్పి మరింత వివాదానికి తావిచ్చారు. అప్పటి నుంచి పిఠాపురం నియోజకవర్గంలో ఇటు టీడీపీ, అటు జనసేన నేతలు, క్యాడర్ మధ్య పొసగడం లేదన్నది యదార్థం. కానీ రెండు పార్టీల అగ్రనేతలు పిఠాపురం లో జరుగుతున్నవిషయాలను పట్టించుకోకపోవడంతో రోజురోజుకూ ముదురుతున్నాయి.
రెండు వర్గాలు బాహాబాహీ...
తాజాగా పిఠాపురం జనసేన ఇన్ ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని టీడీపీ క్యాడర్ అడ్డుకుంది. నియోజకవర్గంలో ఆర్వో ప్లాంట్ ప్రారంభం సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. తమ నేత వర్మకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడం వల్లనే టీడీపీ శ్రేణులు బరస్ట్ అయ్యారంటున్నారు. ఇలా పిఠాపురంలో రెండు పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం విభేదాలను మాపే ప్రయత్నం చేయకపోవడం కూడా టీడీపీ నేతలకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఇంత జరుగుతున్నా తమ పార్టీ నేతలకు, క్యాడర్ కు సర్దిచెప్పాల్సిన పవన్ మౌనం పాటించడం వెనక వర్మను సైడ్ చేయాలన్న లక్ష్యమే కనిపిస్తుందన్న అభిప్రాయం పిఠాపురం టీడీపీ నేతల్లో మరింత బలపడుతుంది. మరి ఈ వివాదం ఎటు దారి తీస్తుందన్నది చూడాలి.
Next Story