Sun Nov 24 2024 15:56:12 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పవన్ అనుకున్నది జరగకపోవచ్చు.. అడ్డంకులు మామూలుగా లేవుగా?
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముందు అనేక సమస్యలున్నాయి. ఆయన తీసుకున్న శాఖ అలాంటిది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముందు అనేక సమస్యలున్నాయి. ఆయన తీసుకున్న శాఖ అలాంటిది. చాలా క్లిష్టతరమైన శాఖ ఆయన ఏరికోరి ఎంచుకున్నారు. ముఖ్యమైన పంచాయతీ రాజ్ శాఖ కావడంతో సమస్యలన్నీ ఆయనకు స్వాగతం చెబుతూనే ఉంటాయి. అవి ఒకనాటితో తీరే సమస్యలు కావు. కేవలం కొన్ని నిధులు వెచ్చిస్తే తొలగిపోయే సమస్యలు కాదు. సుదీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలకు ఇప్పుడు పవన్ కల్యాణ్ చెక్ పెట్టాల్సి ఉంటుంది. పంచాయతీ రాజ్ వ్యవస్థ అంటే గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను తీర్చడం తక్షణ కర్తవ్యమని ఆయన భావిస్తున్నప్పటికీ పవన్ కు అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒకటా.. రెండా.. ఏ గ్రామంలో చూసినా అన్నీ సమస్యలే. వాటిని పరిష్కరించాలంటే ఒకటి, రెండేళ్లు పట్టేది కాదు.
నిధులు లేమితో...
అలాగే నిధులు కూడా అంతే అవసరం. ప్రధానంగా పంచాయతీ రాజ్ వ్యవస్థ అనగానే ముఖ్యంగా గ్రామాల్లో సర్పంచ్ లకు సర్వాధికారాలు ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినపడుతుంది. నిధులు, విధులు సర్పంచ్ లకు ఇస్తే తప్ప గ్రామాలకు బాగుపడవు. అదీ సర్పంచ్ లు ఆ గ్రామాల్లో మనసు పెట్టి పనిచేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి. పంచాయతీ రాజ్ సర్పంచ్ల సంఘం కూడా ఎన్నాళ్ల నుంచో నిధులు, విధుల కోసం పోరాటాలు చేస్తూనే ఉంది. పవన్ కల్యాణ్ కూడా సర్పంచ్ల పోరాటాన్ని సమర్థించారు. 73వ రాజ్యాంగ చట్ట సవరణల మేరకు దానిని అమలు చేయాని ఆ సంఘం అమలు చేస్తుంది. కానీ ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ ఆ దిశగా ప్రయత్నించలేదు.
ప్రభుత్వ ప్రాధాన్యతలు...
ఇక ప్రధానంగా పవన్ సత్వరమే పరిష్కరించాల్సింది గ్రామాల్లో నెలకొన్న తాగు నీటి సమస్య. తాగు నీరు కూడా స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యం. అలాగే గ్రామాల్లో రహదారుల నిర్మాణం. ఈ రెండు సత్వరం చేయాల్సి ఉన్నా ఇప్పటికిప్పుడు పూర్తయ్యే అవకాశం లేదు. ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి. పవన్ కల్యాణ్ కు గ్రామాభివృద్ధి చేయాలని ఉన్నా ఆయనకు నిధులు సహకరించకపోవచ్చని అంటున్నారు. నిధుల లేమితో ఇప్పటికే రాష్ట్ర ఖజానా వెలవెలబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలు వేరేగా ఉన్నాయి. పోలవరం, అమరావతి నిర్మాణాలు ప్రభుత్వ తొలి ప్రాధాన్యాలు. అంతే తప్ప తక్షణమే గ్రామాల్లో తాగు నీటి సమస్య పరిష్కారం ఎంత మాత్రం కాదు. దీంతో పాటు పంచాయతీ రాజ్ శాఖలో వేళ్లూనుకుపోయిన అవినీతి కూడా పవన్ గమ్యానికి అడ్డుపడే అవకాశముంది. మంచి చేద్దామని ఉన్నా పవన్ కల్యాణ్ మాత్రం ఇప్పటికిప్పుడు ఎలాంటి మెరాకిల్ మాత్రం ఏమీ చేయలేరన్నది మాత్రం శాఖపరంగానే కాదు, కూటమి నేతల నుంచి వినిపిస్తున్న మాట. నిధుల కోసం ఎన్నేళ్లు వెయిట్ చేయాలంటే చెప్పలేని పరిస్థితి. మరి పవన్ ఈ వ్యవస్థను ఎలా గాడిన పెడతారన్నది చూడాల్సి ఉంది.
Next Story