Sun Dec 22 2024 19:05:15 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : హేళన చేస్తే ఊరుకోను.. పవన్ వార్నింగ్
హిందూ ధర్మాన్ని హేళన చేస్తే ఊరుకునేది లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు
ఎంత మంది హేళన చేసినా గత ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించామని తెలిపారు. తనకు ఏ రాజకీయ పార్టీపై ద్వేషం లేదన్నారు. తనకు ఆగ్రహం లేదన్నారు. తన జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని భావించానని అన్నారు. వెంకన్నకు అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తాము రాష్ట్ర అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టామని తెలిపారు. తనను, తన కుటుంబాన్ని ఎన్నో అవమానాలు చేసినా తాను భరించానని, కానీ సనాతన ధర్మం పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని తెలిపారు. కల్తీ ప్రసాదాలు పెట్టారని, అన్నప్రసాదాన్ని సరిగా నిర్వహించలేదన్నారు. సనాతనధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారిపై గొడవ పెట్టేందుకే ఈ సమావేశానికి వచ్చానని తెలిపారు.
వారాహి డిక్లరేషన్ ను...
ఈ సందర్భంగా వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా కాదు, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా కాదు, సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి సగటు భారతీయుడిగా మీ ముందుకు వచ్చానని తెలిపారు. హైందవ సమాజాన్ని హేళన చేస్తున్న వారికి పదకొండు సీట్లు మాత్రమే కట్టబెట్టారని గుర్తు చేశారు. భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మమన్నారు పవన్ కల్యాణ్. సనాతన ధర్మానికి నిలువెత్తు నిదర్శనం రామచంద్రమూర్తి అని, కలియుగ వైకుంఠంలో దేవుడికి అన్యాయం జరిగితే ప్రాయశ్చిత్త దీక్ష చేయకూడదా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. హిందుత్వాన్ని పాటిస్తా, అన్ని మతాలను తాను గౌరవిస్తానని తెలిపారు.
ఇతర మతాలను గౌరవిస్తానంటూ...
ఇస్లాంను గౌరవిస్తా, క్రిస్టియానిటినీ గౌరవిస్తా.. హిందుత్వాన్ని పాటిస్తానంటూ పవన్ కల్యాణ్ అరిచి మరీ చెప్పారు. తాను ఎన్నడూ ధర్మం తప్పనని, అది జరిగితే తనకు డిప్యూటీ సీఎం పదవి కూడా అక్కరలేదని పవన్ కల్యాణ్ అన్నారు. అన్నీ రాజకీయాలేనా? అన్నీ ఓట్ల కోసమే చేస్తామా? అని ఆయన నిలదీశారు. పరాభవం పొందినా, పరాజయం చెందినా తాను మౌనంగానే ఉంటానని అన్నారు. గత కొంత కాలంగా కల్తీ నెయ్యితో, జంతువుల కొవ్వుతో ఏడుకొండల వాడికి ప్రసాదం పెడతారన్నారు. అవే లడ్డూలు అయోధ్యకు పంపిస్తాని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాముడ్ని తిడితే హిందువులుగా బాధపడకూడదన్నారు. చివరకు తన కూతురితోనే తాను తిరుమలలో డిక్లరేషన్ ఇప్పించారని తెలిపారు.
Next Story