Sun Dec 22 2024 16:01:04 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేడు కూడా కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. దసరా పండగ రోజున స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. దసరా పండగ రోజున స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. పండగ వేళ అయినా సరే.. బ్రహ్మోత్సవాల ముగింపు రోజున చక్రస్నానం చూసేందుకు వేలాది మంది భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. గోవింద నామ స్మరణలతో తిరుమల వీధులన్నీ మారుమోగుతున్నాయి. ఎక్కడ చూసినా గోవింద నామస్మరణే వినిపిస్తుంది. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. హుండీ ఆదాయం కూడా భారీగానే పెరుగుతుంది. అదే సమయంలో స్వామి వారి దర్శనానికి కూడా సమయం ఎక్కువగానే పడుతుంది. అయినా భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండి మరీ స్వామి వారిని దర్శించుకునేందుకు ఇష్టపడుతున్నారు. అన్ని చోట్ల భక్తులు దర్శనమిస్తుండటంతో తిరుమల వీధులన్నీ కొత్త కళను సంతరించుకున్నాయి.
12 గంటల సమయం...
తిరుమలలో నేటితో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. చక్రస్నానం వీక్షించేందుకు వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. నమో వెంకటేశాయ అంటూ భక్తులు నినాదాల మధ్య చక్రస్నాన కార్యక్రమం ముగిసింది. రాత్రికి ధ్వజా అవరోహణంతో బ్రహ్మోత్సవలు ముగియనున్నాయి. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పన్నెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 71,443 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,948 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.52 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈరోజు శనివారం కూడా కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. శని, ఆదివారాలు సహజంగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దసరా సెలవులు కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతుంది.
Next Story